తెలంగాణ

మేడారం సాక్షిగా చారిత్రాత్మక నిర్ణయాలు:                       వనదేవతల చెంత ‘వరాల’ జల్లు!
మేడారం సాక్షిగా చారిత్రాత్మక నిర్ణయాలు: వనదేవతల చెంత ‘వరాల’ జల్లు!
  • హైదరాబాద్ మెట్రో విస్తరణకు రూ. 2007 కోట్లు..
  • త్వరలో మున్సిపల్ ఎన్నికలు..
  • జంపన్న వాగుకు శాశ్వత జలకళ

(మేడారం నుంచి జనవాణి ప్రత్యేక ప్రతినిధి)

మేడారం/ములుగు: తెలంగాణ పాలనా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. సచివాలయ ఏసీ గదులకు పరిమితమైన మంత్రివర్గ సమావేశం, తొలిసారిగా అడవి బిడ్డల నడుమ, వనదేవతల సాక్షిగా మేడారం గడ్డపై జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాత్రి జరిగిన ఈ 27వ క్యాబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, మేడారం శాశ్వత కట్టడాలు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ వివరాలను వెల్లడించారు.

మేడారం ఇకపై ‘తెలంగాణ తిరుపతి’: మేడారం జాతరను కేవలం నాలుగు రోజుల పండుగలా కాకుండా, ఏడాది పొడవునా భక్తులు సందర్శించేలా ‘తిరుపతి, కుంభమేళా’ స్థాయికి తీర్చిదిద్దాలని క్యాబినెట్ నిర్ణయించింది.

శాశ్వత ఆలయం: చరిత్రలో నిలిచిపోయేలా పునరుద్ధరించిన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని సోమవారం (జనవరి 19) ఉదయం 7 గంటలకు సీఎం ప్రారంభించనున్నారు.

భూ సేకరణ: ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే 19 ఎకరాలు సేకరించగా, మరో 22 ఎకరాలు సేకరించనున్నారు. మొత్తంగా 441 ఎకరాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అభివృద్ధి చేయనున్నారు.

జంపన్న వాగుకు జలకళ: రూ. 35 కోట్లతో రామప్ప చెరువు నుంచి లక్నవరం మీదుగా పైప్‌లైన్ వేసి, జంపన్న వాగులో 365 రోజులూ నీరు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు.

హైదరాబాద్ మెట్రో & ఇన్ఫ్రాస్ట్రక్చర్: విశ్వనగరం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

మెట్రో విస్తరణ: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (ఏ, బి) విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం రూ. 2007 కోట్లను మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం అడిగిన సందేహాలను నివృత్తి చేస్తూ పనులు వేగవంతం చేయనున్నారు.

ఫ్లై ఓవర్: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ట్రిపుల్ సి (CCC) నుంచి శిల్పా లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్/రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు.

త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా: రాష్ట్రంలో గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారయ్యాయని, ఫిబ్రవరి 15 (శివరాత్రి), రంజాన్, పరీక్షల సీజన్ కంటే ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇతర కీలక నిర్ణయాలు:

గోదావరి పుష్కరాలు – 2027: వచ్చే ఏడాది రాబోయే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ‘టెంపుల్ టూరిజం సర్క్యూట్’ అభివృద్ధికి మార్చి 31 నాటికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

విద్యా రంగం: నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజీ (Law College) ఏర్పాటుకు, ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. రూ. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు.

సాగునీరు: ములుగు జిల్లాలోని 7 వేల నుంచి 20 వేల ఎకరాలకు సాగునీరందించే ‘మల్లంపల్లి – పొట్లపల్లి’ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ. 143 కోట్లు మంజూరు చేశారు.

గ్రామీణ రోడ్లు: పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా రూ. 6 వేల కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు.

అడవి బిడ్డల కలను నిజం చేశాం – మంత్రి సీతక్క: తమ ప్రాంతానికి గోదావరి జలాలు, శాశ్వత ఆలయం కావాలన్నది తన చిరకాల కోరిక అని, అది నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నెరవేరిందని మంత్రి సీతక్క ఉద్వేగంగా పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చి క్యాబినెట్ నిర్వహించడం ద్వారా ప్రభుత్వం గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు.

‘సెలెక్టివ్’ జర్నలిజం.. సర్కారుకు ‘కలెక్టివ్’ డ్యామేజ్!
‘సెలెక్టివ్’ జర్నలిజం.. సర్కారుకు ‘కలెక్టివ్’ డ్యామేజ్!
మీ కడుపులో ఉన్నది విషం.. దానికి మందు వికారాబాద్ ఆసుపత్రి!” – అసెంబ్లీలో సీఎం రేవంత్ విశ్వరూపం
మీ కడుపులో ఉన్నది విషం.. దానికి మందు వికారాబాద్ ఆసుపత్రి!” – అసెంబ్లీలో సీఎం రేవంత్ విశ్వరూపం
జలయజ్ఞంలో ‘తెలంగాణ సంతకం’..                                                                                  రేవంత్ అమ్ములపొదిలో ‘ఆదిత్య’ అస్త్రం!
జలయజ్ఞంలో ‘తెలంగాణ సంతకం’.. రేవంత్ అమ్ములపొదిలో ‘ఆదిత్య’ అస్త్రం!

బైలైన్ పురుషోత్తం

రాజకీయ చాణక్యుడు
రాజకీయ చాణక్యుడు

(నేడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతి)

తెలంగాణ రాజకీయ చరిత్ర పుటలను తిరగేస్తే.. అక్కడ దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చున్న ఒక “రాజకీయ ఉద్ధండుడు” కనిపిస్తాడు. ఆయనే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. ఆయనను కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రిగానో, లేదా గవర్నర్‌గానో చూస్తే ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసినట్లే అవుతుంది. ఎందుకంటే, చెన్నారెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక రాజకీయ వ్యవస్థ. 1969లో ఢిల్లీ పీఠం కదిలేలా “జై తెలంగాణ” నినాదాన్ని నినదించిన గొంతుక ఆయన. నేడు (జనవరి 13) ఆయన జయంతి సందర్భంగా ఆ మహానేత రాజకీయ ప్రస్థానాన్ని, ఆయనలోని పౌరుషాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోవడం మన బాధ్యత.

వికారాబాద్ జిల్లా (నాటి హైదరాబాద్ రాష్ట్రం) సిర్పూర్‌లో 1919, జనవరి 13న జన్మించిన చెన్నారెడ్డి, వృత్తిరీత్యా వైద్యుడు. రోగి నాడి పట్టుకోవడంలోనే కాదు, ప్రజా నాడి (Pulse of the people) పట్టుకోవడంలోనూ ఆయన దిట్ట అని నిరూపించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా మొదలైన ఆయన ప్రస్థానం, భారత రాజకీయాల్లో ఒక “చాణక్యుడి”గా ఎదిగేలా చేసింది.

చెన్నారెడ్డి గారి రాజకీయ జీవితంలో “1969 తెలంగాణ ఉద్యమం” ఒక సువర్ణాధ్యాయం. అప్పటికే ఆంధ్రా పాలకుల ఆధిపత్యంపై రగిలిపోతున్న తెలంగాణ సమాజానికి ఒక దిశానిర్దేశం చేసిన నాయకుడు ఆయన. “తెలంగాణ ప్రజా సమితి” (TPS) స్థాపించి, కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఆ రోజుల్లో ఇందిరా గాంధీ వంటి ఉక్కు మహిళ ప్రధానిగా ఉన్నప్పుడే, ఆమెను ఎదిరించి నిలబడటం సామాన్య విషయం కాదు. 1971 ఎన్నికల్లో తెలంగాణలోని 14 ఎంపీ సీట్లలో 10 సీట్లు గెలిచి, తెలంగాణ ఆకాంక్ష ఎంత బలమైనదో దేశం మొత్తానికి చాటిచెప్పిన ధీశాలి ఆయన. ఆనాడు ఆయన రగిలించిన ఆ ఉద్యమ స్ఫూర్తి, తర్వాతి తరాలకు ఒక పాఠంగా మిగిలింది. అయితే, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఆరు సూత్రాల పథకం (Six Point Formula) ఒప్పందంతో టి.పి.ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయడంపై విమర్శలు ఉన్నప్పటికీ, ఆ నిర్ణయం వెనుక నాటి రాజకీయ అనివార్యత ఉందన్నది విశ్లేషకుల మాట.

ఇక పరిపాలనా దక్షుడిగా చెన్నారెడ్డి గారి శైలి చాలా భిన్నం. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (1978, 1989) పనిచేసిన ఆయన, అధికారుల పాలిట సింహస్వప్నంలా ఉండేవారు. ఫైల్స్ క్లియర్ చేయడంలో ఆయన వేగం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన తెగువ ఇప్పటికీ ఐఏఎస్ సర్కిల్స్‌లో కథలుగా చెప్పుకుంటారు. బ్యూరోక్రసీని ఎలా పరుగులు పెట్టించాలో తెలిసిన పాలకుడు ఆయన. రాజకీయాల్లో ఎన్ని గ్రూపులు ఉన్నా, ఎంతటి అసమ్మతి ఉన్నా.. తనదైన వ్యూహాలతో వాటిని తిప్పికొట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసి జాతీయ స్థాయిలో తన ముద్ర వేశారు. ముఖ్యంగా తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు, నాటి ముఖ్యమంత్రి జయలలితతో రాజ్యాంగపరమైన అంశాలపై ఆయన జరిపిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎంతటి వారినైనా ఎదిరించే మొండి ధైర్యం (Stubbornness) ఆయన సొంతం.

నేటి తరం రాజకీయ నాయకులకు చెన్నారెడ్డి గారి జీవితం ఒక కేస్ స్టడీ. పదవులు వచ్చినప్పుడు పొంగిపోకుండా, పోయినప్పుడు కుంగిపోకుండా.. నిరంతరం ప్రజల్లో, రాజకీయాల్లో మమేకమై ఉండటం ఆయన ప్రత్యేకత. ఆయన వేసుకున్న ప్రణాళికలు, హైదరాబాద్ అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు నేటికీ మన కళ్లముందు కనిపిస్తున్నాయి. తెలంగాణ అనే పదం వినిపించినప్పుడల్లా, 1969 ఉద్యమం గుర్తొచ్చినప్పుడల్లా.. మర్రి చెన్నారెడ్డి గారి పేరు ప్రస్తావించకుండా చరిత్ర ముందుకు సాగదు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన నింపిన ఆ “పోరాట పటిమ” మాత్రం తెలంగాణ గడ్డపై ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

– పురుషోత్తం నారగౌని

సింహమా.. నిద్రలే!
సింహమా.. నిద్రలే!
కలమే కాగితాన్ని చింపేస్తే..!
కలమే కాగితాన్ని చింపేస్తే..!