- బిల్లులను నిరవధికంగా నిలిపే అధికారం లేదని స్పష్టం
- గవర్నర్–రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- గడువు విధించడం తగదని న్యాయస్థానం వ్యాఖ్యానం
న్యూఢిల్లీ, నవంబర్ 20 : రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు గురువారం స్పష్టమైన దిశ నిర్దేశం చేసింది. ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై విచారణ జరిపిన అనంతరం, బిల్లుల ఆమోదానికి గవర్నర్ లేదా రాష్ట్రపతికి గడువు విధించటం అనుచితమని న్యాయస్థానం తేల్చింది. గవర్నర్లు కారణం చెప్పకుండా బిల్లులను వెనక్కి పంపలేరని, వాటిని నిరవధికంగా నిలిపివేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లును రాష్ట్రపతికి పంపితేనే రాష్ట్రపతి సంబంధిత చర్యలు తీసుకోగలరని కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు ఉన్న విచక్షణాధికారాన్ని గుర్తించినప్పటికీ, దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండకూడదని సూచించింది. గవర్నర్ పాత్రను నిర్వచిస్తూ కోర్టు, బిల్లును పరిశీలించడం, అవసరమైతే సూచనలు ఇవ్వడం, లేదా రాష్ట్రపతికి పంపించటం మాత్రమే తమ అధికార పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాష్ట్రపాలనలో తుది నిర్ణయాధికారం ఎన్నికైన మంత్రివర్గానిదేనని, ఒక రాష్ట్రంలో రెండు ఎగ్జిక్యూటివ్ పవర్స్ కొనసాగలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యానం భారత రాజ్యాంగ పరిపాలన వ్యవస్థపై కీలక ప్రభావం చూపనుంది. బిల్లుల పెండింగ్ వ్యవహారాలపై గవర్నర్–సర్కార్ మధ్య నెలకొన్న వివాదాలు అధికమైన నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పు, భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు–రాజ్యపాలల నిర్ణయ ప్రక్రియను మరింత స్పష్టంగా మారుస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.