పదేళ్లు నిద్రపోయిన సంఘాలే.. నేడు మొసలి కన్నీరు కారుస్తున్నాయి – ఆ ఆందోళనల వెనుక ఉన్నది జర్నలిస్టుల సంక్షేమం కాదు.. స్వార్థ రాజకీయమే – రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది జర్నలిస్టు ఫ్రెండ్లీ విధానం: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ స్పష్టీకరణ – కమిషనర్‌తో భేటీలో సమస్యల పరిష్కారంపై హామీ
హైదరాబాద్ (డిసెంబర్ 31): “ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అక్రిడిటేషన్ రగడకు కారణం ప్రభుత్వం కాదు.. దశాబ్దాలుగా వ్యవస్థను శాసిస్తున్న కొన్ని యూనియన్ల స్వార్థమే. గత బి. ఆర్. ఎస్. ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా పెదవి విప్పని, పాదం కదపని నాయకులు.. ఇప్పుడు చేస్తున్న ధర్నాలు కేవలం ‘కపట నాటకాలు’ మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం జర్నలిస్టుల పట్ల అత్యంత సానుకూలంగా ఉంది” అని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ స్పష్టం చేసింది.
మంగళవారం సమాచార శాఖ కమిషనర్‌ను కలిసిన అనంతరం టి.ఎస్.జే.యు. నాయకులు మాట్లాడుతూ ,
సంఘాల మోసాన్ని నమ్మొద్దు: “గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టు నిధులు పక్కదారి పడుతున్నా, ఇన్సూరెన్స్ ఆగిపోయినా చోద్యం చూసిన కొన్ని సంఘాలు.. ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయి. జీవో రూపకల్పనలో లోపాలకు కారణం ఆ సంఘాల తప్పుడు సలహాలే. ఇప్పుడు జర్నలిస్టులు తిరగబడేసరికి.. ప్లేట్ ఫిరాయించి ఆందోళనల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నాయి. జర్నలిస్టులు ఈ మోసాన్ని గమనించాలి” అని టి.ఎస్.జే.యు.హెచ్చరించింది.
ప్రభుత్వం సానుకూలం – కమిషనర్ భరోసా: “జర్నలిస్టుల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందన చాలా సానుకూలంగా ఉంది. అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్ది అందరికీ న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు” అని తెలిపారు.
చర్చల్లోని ముఖ్యాంశాలు – విజయాలు:
ఇన్సూరెన్స్ పక్కా: జర్నలిస్టుల కుటుంబాలకు రక్షణగా నిలిచే ‘గ్రూప్ ఇన్సూరెన్స్’ పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.
డెస్క్ జర్నలిస్టులకు గుర్తింపు: క్షేత్రస్థాయి జర్నలిస్టులతో సమానంగా డెస్క్ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ పథకాలు, అక్రిడిటేషన్ వర్తింపజేసేలా జీవోలో మార్పులు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
చిన్న పత్రికలకు న్యాయం: గతంలో మాదిరిగా కాకుండా, చిన్న పత్రికల ఎంపానెల్మెంట్ ప్రక్రియను సరళతరం చేసి, వాటికి అండగా ఉంటామని ప్రభుత్వం చెప్పినట్లు వెల్లడించారు.
ప్రజా ప్రభుత్వంపై నమ్మకం ఉంది: కొన్ని సంఘాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జర్నలిస్టుల పక్షపాతని.. త్వరలోనే అన్ని సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని టి.ఎస్.జే.యు. ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో టి.ఎస్.జే.యు. రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని , ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల, ఆర్గ నైజింగ్ సెక్రటరీ క్రాంతి తదితరులు తదితరులు పాల్గొన్నారు.