మూసీ పాపం హైదరాబాద్‌ది.. శాపం నల్గొండది – అడ్డుపడితే సహించం – గోదావరి నుండి 20 టీఎంసీల తరలింపు – అసెంబ్లీలో సీఎం స్పష్టమైన ప్రకటన
(జనవాణి బ్యూరో, హైదరాబాద్): మూసీ నది ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మూసీ నదిలో ఉన్న కాలుష్యం కంటే.. ప్రతిపక్ష నేతల కడుపులో ఉన్న విషమే ఎక్కువ ప్రమాదకరం. ఆ విషం తగ్గాలంటే మీకు వికారాబాద్ అడవుల్లోని గాలి తగలాల్సిందే. మిమ్మల్ని అక్కడికే పంపి చికిత్స చేయిస్తాం” అని సీఎం చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి.
శుక్రవారం అసెంబ్లీలో మూసీ నది అభివృద్ధిపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను, చారిత్రక వాస్తవాలను సభ ముందుంచారు.
సీఎం ప్రసంగంలోని కీలక అంశాలు :
1. “నల్గొండకు దేవుడిచ్చిన శిక్ష”: మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని సీఎం వివరించారు. “హైదరాబాద్ మురికి అంతా వెళ్ళి నల్గొండలో కలుస్తోంది. అక్కడి నీళ్లు తాగి పశువులు చనిపోతున్నాయి. పుట్టే పిల్లలు అష్టవంకర్లతో పుడుతున్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. నల్గొండ జిల్లాకు దేవుడే శిక్ష వేసినట్లుంది. వారి కష్టాలు తీరాలంటే మూసీని ప్రక్షాళన చేసి, గోదావరి నుండి 20 టీఎంసీల నీటిని తరలించాల్సిందే” అని స్పష్టం చేశారు.
2. 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్: ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి గండిపేట నుండి గౌరెల్లి (ఔటర్ రింగ్ రోడ్ టు ఔటర్ రింగ్ రోడ్) వరకు 55 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. దీనివల్ల 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించే పనిలేకుండా, తక్కువ సమయంలోనే నగరాన్ని దాటవచ్చని తెలిపారు.
3. అంతర్జాతీయ కన్సల్టెంట్లు: మూసీ అభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయి సంస్థలైన ‘మాన్హా – సింగపూర్’, మరియు ‘కుష్మన్ & వేక్ఫీల్డ్’ కన్సార్టియంను నియమించామని, వారు ఇచ్చే డీపీఆర్ (DPR) ఆధారంగానే ముందుకు వెళ్తామని, ఇందులో దాపరికమేమీ లేదని స్పష్టం చేశారు.
4. సర్వమత సమ్మేళనం: మూసీ నది ఒడ్డున మత సామరస్యాన్ని చాటేలా నాలుగు అద్భుత కట్టడాలను నిర్మిస్తామని సీఎం వెల్లడించారు:
- హిందువుల కోసం: మంచిరేవుల వద్ద కాకతీయుల నాటి శివాలయం పునరుద్ధరణ.
- ముస్లింల కోసం: మక్కా మసీదు తరహాలో అంతర్జాతీయ స్థాయి మసీదు.
- సిక్కుల కోసం: గౌలిగూడ వద్ద స్వర్ణ దేవాలయం తరహా గురుద్వారా.
- క్రైస్తవుల కోసం: ఉప్పల్ వద్ద మెదక్ చర్చి తరహాలో భారీ చర్చి.
5. గాంధీ సరోవర్ & డిఫెన్స్ ల్యాండ్: బాపుఘాట్ వద్ద ‘గాంధీ సరోవర్’ నిర్మిస్తామని, అక్కడ ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికోసం కేంద్ర రక్షణ శాఖ (Defence) నుండి భూములు కోరామని, రాజ్ నాథ్ సింగ్ గారు సానుకూలంగా స్పందించి ప్రాథమికంగా 55 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారని సభకు తెలిపారు.
6. వికారాబాద్ చికిత్స : నిరంతరం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి.. “వికారాబాద్ గాలికి టీబీ లాంటి రోగాలే నయమవుతాయి. మీ కడుపులో ఉన్న విషం తగ్గాలంటే మిమ్మల్ని అక్కడికే పంపి అడ్మిట్ చేయించాలి” అని సీఎం ఎద్దేవా చేశారు
“నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ని కాదు.. ఈ నగరానికి బ్రాండ్ అంబాసిడర్‌ని” అని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి, పేదలకు నష్టం కలగకుండా, వారికి అక్కడే పక్కన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, స్కూళ్లు కట్టించి మరీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.