ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో తెలంగాణ పవిలియన్ ఆకట్టుకుంది | పోచంపల్లి ఇక్కత్ ప్రత్యేక ఆకర్షణ
ప్రతిష్ఠాత్మక ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్.. (ఐఐటీఎఫ్) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శుక్రవారం నాడు మొదలయింది. ఈ ఫెయిర్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పవిలియన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయెల్ నేడు తెలంగాణ పవిలియన్ ను ప్రారంభించారు.
ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో.. రాష్ట్ర పరిశ్రమలు,ఎగుమతుల ప్రోత్సాహక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని.. నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, జనగామ, వరంగల్ అర్బన్, నారాయణపేట్ జిల్లాలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులు, చేనేత వస్త్రాలు, గిరిజన ఆభరణాలు, చేతితో తయారు చేసిన గాజులు, హెర్బల్, మెడికల్ ఉత్పత్తులు, పోచంపల్లి వస్త్రాలు, ఫ్యూజన్ బ్యాగ్స్‌ను ఈ స్టాల్స్‌లో ప్రదర్శించారు. ఈసారి నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో.. తెలంగాణ స్టాల్స్ ప్రత్యేక గుర్తింపు పొందాయి.
తాజా ట్రేడ్ ఫెయిర్‌లో పోచంపల్లికి చెందిన స్పెషల్ ఇక్కత్ చేనేత వస్త్రాలను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా ఇక్కత్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, వాస్‌కోట్స్, దుప్పట్టా, కాటన్ బెడ్షీడ్స్, షర్టింగ్ ఫ్యాబ్రిక్స్ తదితర వైరెటీలను అందుబాటులో ఉంచారు. ఈ ట్రేడ్ ఫెయిర్ రెండు వారాలు కొనసాగనుంది. మన దేశ ఐక్యత, వైవిధ్యం, జాతీయ పురోగతిని సూచిస్తూ జరుపుకునే “ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్” అనే ఇతివృత్తాన్ని ఈ 44వ ఎడిషన్ హైలైట్ చేస్తుంది.








