- హైదరాబాద్ మెట్రో విస్తరణకు రూ. 2007 కోట్లు..
- త్వరలో మున్సిపల్ ఎన్నికలు..
- జంపన్న వాగుకు శాశ్వత జలకళ
(మేడారం నుంచి జనవాణి ప్రత్యేక ప్రతినిధి)
మేడారం/ములుగు: తెలంగాణ పాలనా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. సచివాలయ ఏసీ గదులకు పరిమితమైన మంత్రివర్గ సమావేశం, తొలిసారిగా అడవి బిడ్డల నడుమ, వనదేవతల సాక్షిగా మేడారం గడ్డపై జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాత్రి జరిగిన ఈ 27వ క్యాబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, మేడారం శాశ్వత కట్టడాలు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ వివరాలను వెల్లడించారు.
మేడారం ఇకపై ‘తెలంగాణ తిరుపతి’: మేడారం జాతరను కేవలం నాలుగు రోజుల పండుగలా కాకుండా, ఏడాది పొడవునా భక్తులు సందర్శించేలా ‘తిరుపతి, కుంభమేళా’ స్థాయికి తీర్చిదిద్దాలని క్యాబినెట్ నిర్ణయించింది.
శాశ్వత ఆలయం: చరిత్రలో నిలిచిపోయేలా పునరుద్ధరించిన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని సోమవారం (జనవరి 19) ఉదయం 7 గంటలకు సీఎం ప్రారంభించనున్నారు.
భూ సేకరణ: ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే 19 ఎకరాలు సేకరించగా, మరో 22 ఎకరాలు సేకరించనున్నారు. మొత్తంగా 441 ఎకరాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అభివృద్ధి చేయనున్నారు.
జంపన్న వాగుకు జలకళ: రూ. 35 కోట్లతో రామప్ప చెరువు నుంచి లక్నవరం మీదుగా పైప్లైన్ వేసి, జంపన్న వాగులో 365 రోజులూ నీరు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు.
హైదరాబాద్ మెట్రో & ఇన్ఫ్రాస్ట్రక్చర్: విశ్వనగరం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
మెట్రో విస్తరణ: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (ఏ, బి) విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం రూ. 2007 కోట్లను మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం అడిగిన సందేహాలను నివృత్తి చేస్తూ పనులు వేగవంతం చేయనున్నారు.
ఫ్లై ఓవర్: ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ట్రిపుల్ సి (CCC) నుంచి శిల్పా లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్/రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా: రాష్ట్రంలో గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారయ్యాయని, ఫిబ్రవరి 15 (శివరాత్రి), రంజాన్, పరీక్షల సీజన్ కంటే ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇతర కీలక నిర్ణయాలు:
గోదావరి పుష్కరాలు – 2027: వచ్చే ఏడాది రాబోయే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు ‘టెంపుల్ టూరిజం సర్క్యూట్’ అభివృద్ధికి మార్చి 31 నాటికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
విద్యా రంగం: నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజీ (Law College) ఏర్పాటుకు, ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. రూ. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు.
సాగునీరు: ములుగు జిల్లాలోని 7 వేల నుంచి 20 వేల ఎకరాలకు సాగునీరందించే ‘మల్లంపల్లి – పొట్లపల్లి’ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ. 143 కోట్లు మంజూరు చేశారు.
గ్రామీణ రోడ్లు: పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా రూ. 6 వేల కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు.
అడవి బిడ్డల కలను నిజం చేశాం – మంత్రి సీతక్క: తమ ప్రాంతానికి గోదావరి జలాలు, శాశ్వత ఆలయం కావాలన్నది తన చిరకాల కోరిక అని, అది నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నెరవేరిందని మంత్రి సీతక్క ఉద్వేగంగా పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చి క్యాబినెట్ నిర్వహించడం ద్వారా ప్రభుత్వం గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు.