( ఆయనది ఆంధ్రా కాదు.. బీహార్. ఆయన మనసు మాత్రం తెలంగాణ ప్రాజెక్టుల దగ్గరే!)
హైదరాబాద్: రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, ఒక నిజాయితీ గల అధికారిని, ఒక నిష్ణాతుడైన నిపుణుడిని ప్రాంతం పేరుతో అవమానించడం అవివేకం. నేడు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న ఆదిత్యానాథ్ దాస్ ఎవరో కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాజెక్టులకు “పురుడు పోసిన” అధికారి. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ “జల మేధావి”ని ఎందుకు దగ్గరకు తీశారో, ఆయన విలువేంటో తెలిపే ప్రత్యేక కథనం ఇది.
ఎవరీ ఆదిత్యానాథ్ దాస్? ఆయన ఆంధ్రా వ్యక్తి కాదు.. బీహార్ బిడ్డ. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రాంతీయ బేధాలు లేని నిష్పాక్షిక అధికారి. అందుకే ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో.. “నేను తెలంగాణలోనే పనిచేస్తా” అని ఆప్షన్ ఇచ్చుకున్నారు. కానీ విధివశాత్తు ఆంధ్రా క్యాడర్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా తనదైన ముద్ర వేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీగా) రిటైర్ అయ్యారు.
తెలంగాణ ప్రాజెక్టుల ‘ఎన్సైక్లోపీడియా’: 2004 నుండి 2014 వరకు.. అంటే సరిగ్గా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో.. ఇక్కడి ప్రాజెక్టులకు ఊపిరి పోసింది ఆదిత్యానాథ్ దాస్ గారే. ప్రాణహిత-చేవెళ్ల: దీనికి సంబంధించిన కీలక జీవోలు ఇచ్చింది ఆయనే. పాలమూరు-రంగారెడ్డి: ఉమ్మడి రాష్ట్రంలోనే దీనికి రూపకల్పన చేసి, జీవో నం. 3 ద్వారా అనుమతులు ఇచ్చింది ఆయనే. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ: ఈ ప్రాజెక్టుల అంగుళం అంగుళం ఆయనకు తెలుసు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు.. “తెలంగాణ ప్రాజెక్టుల పుట్టుక, వాటి అసలు డిజైన్లు తెలిసిన ఏకైక వ్యక్తి ఆదిత్యానాథ్ దాస్.”
దొంగను పట్టాలంటే.. ‘పోలీస్’ కావాలి: గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల డిజైన్లను మార్చేసింది. అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఆ “దొంగతనాన్ని” పట్టుకోవాలంటే.. అసలు డిజైన్ తెలిసిన వ్యక్తి కావాలి కదా? అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిత్యానాథ్ దాస్‌ను అడ్వయిజర్‌గా తెచ్చుకున్నారు.
నాడు తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు ఎలా డిజైన్ చేశారు.. నేడు అది లక్ష కోట్లకు ఎలా మారింది? అనే చిక్కుముడిని విప్పగలిగే “మాస్టర్ కీ” ఆదిత్యానాథ్ దాస్.
రేవంత్ నమ్మకం – ఆదిత్య నిబద్ధత: కేసీఆర్ గారు తమకు అనుకూలమైన అధికారులను (సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ వంటి వారిని) పక్కన పెట్టుకుంటే.. రేవంత్ రెడ్డి గారు మాత్రం “సబ్జెక్ట్ నాలెడ్జ్” ఉన్న అధికారిని ఎంచుకున్నారు. ఆదిత్యానాథ్ దాస్ రాకతో ఇరిగేషన్ శాఖలో పాత ఫైళ్లు బయటకు వస్తున్నాయి. అబద్ధాల పునాదులు కదులుతున్నాయి.
రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా.. కేవలం “నీటి పారుదల రంగం”పై పట్టున్న అధికారి సేవలను వాడుకోవడం రేవంత్ రెడ్డి గారి దార్శనికతకు నిదర్శనం. ఆదిత్యానాథ్ దాస్.. ఇప్పుడు తెలంగాణ అమ్ములపొదిలో చేరిన ఒక పదునైన “ఆదిత్య” బాణం. అది లక్ష్యం తప్పదు.. వాస్తవాలను వెలికితీయక మానదు!
- పురుషోత్తం నారగౌని
సీనియర్ జర్నలిస్ట్
మొబైలు: 8897388393)