పది బస్సులు పెడితే ఖజానా ఖాళీ అవుతుందా?
గొప్ప నిర్ణయానికి.. ఈ ‘సంకుచిత’ ప్రచారం అవసరమా?
సమాచార పౌర సంబంధాల శాఖ తీరుతో సంకట స్థితిలో సర్కారు
తెలంగాణ చరిత్రలో మేడారం గడ్డపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించడం అనేది ఒక సాహసోపేతమైన, చారిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే యంత్రాంగం కూడా అంతే విశాలంగా ఆలోచించాలి. కానీ, దురదృష్టవశాత్తు సమాచార పౌర సంబంధాల శాఖ అనుసరిస్తున్న “సెలెక్టివ్ విధానం” ప్రభుత్వ ఆశయానికి గండి కొట్టేలా ఉంది.
మేడారం పర్యటన కోసం మీడియాను ఆహ్వానించిన తీరు, అందులో చూపించిన వివక్ష.. ప్రభుత్వానికి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందనడానికి కొన్ని బలమైన కారణాలు ఇవి:
- పది బస్సులు పెడితే పోయేదేముంది? : హైదరాబాద్ నుండి మీడియాను తీసుకెళ్లాలనుకోవడం మంచిదే. కానీ కేవలం ఒక బస్సు పెట్టి, కొందరిని మాత్రమే “ఎంపిక” చేయడం ఎందుకు?
ఇంత చారిత్రాత్మక ఘట్టాన్ని కవర్ చేయడానికి.. ఒక పది బస్సులు పెట్టి, ఆసక్తి ఉన్న జర్నలిస్టులందరినీ (చిన్న, పెద్ద తేడా లేకుండా) తీసుకెళ్లి ఉంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి?
ఆ పది బస్సుల ఖర్చు ప్రభుత్వానికి ఒక లెక్క కాదు. కానీ, “ప్రభుత్వం మమ్మల్ని అందరినీ ఆహ్వానించింది, గౌరవించింది” అనే సానుకూల భావన వేల మంది జర్నలిస్టుల్లో కలిగేది.
కొందరినే పిలిచి, మిగతా వారిని వదిలేయడం వల్ల.. అనవసరంగా లేని అసంతృప్తిని ఎందుకు పెంచుకుంటున్నారు? “అందరినీ కలుపుకుపోతే వచ్చే ప్రచారం కొండంత.. కొందరిని పిలిస్తే వచ్చేది గోరంత” అనే లాజిక్ అధికారులు ఎందుకు మిస్ అవుతున్నారు?
- అందరినీ కలుపుకుపోవడమే అసలైన బలం: ప్రభుత్వానికి కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు, క్షేత్రస్థాయిలో పనిచేసే చిన్న, మధ్య తరహా మీడియా మద్దతు కూడా అంతే అవసరం.
కేవలం కొందరినే ఎంపిక చేసుకోవడం ద్వారా.. మిగతా వేలాది మంది జర్నలిస్టులలో “మాకు గుర్తింపు లేదు” అనే భావన కలుగుతుంది.
ప్రభుత్వానికి నిత్యం ప్రజల్లో ప్రచారం కల్పించే ఈ అతిపెద్ద వర్గాన్ని దూరం చేసుకోవడం వ్యూహాత్మకంగా మంచిది కాదు.
అందరినీ సమానంగా చూసినప్పుడే.. ప్రభుత్వం పట్ల మీడియా వర్గాల్లో గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఆ నమ్మకమే కష్టకాలంలో ప్రభుత్వానికి రక్షణగా నిలుస్తుంది.
- ‘సెలెక్టివ్’ వద్దు.. ‘కలెక్టివ్’ ముద్దు: ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా యుగం నడుస్తోంది. సాంప్రదాయ మీడియా కంటే వేగంగా వార్తలు చేరవేసే మాధ్యమాలు ఎన్నో వచ్చాయి. జనం కూడా అన్ని రకాల వార్తలను చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో కేవలం కొన్ని సంస్థల ప్రతినిధులనే తీసుకెళ్లడం వల్ల.. ప్రభుత్వ వార్త అందరికీ చేరదు.
అదే మీరు పెంచిన ఆ పది బస్సుల్లో.. మిగతా జర్నలిస్టులకు కూడా చోటు కల్పిస్తే.. ప్రభుత్వ ప్రచారం మరింత విస్తృతంగా, వేగంగా సామాన్యుడికి చేరేది.
ఈ “ఎక్స్ క్లూజివ్ క్లబ్” సంస్కృతిని వదిలేసి.. అందరినీ కలుపుకుపోయే “ఇన్ క్లూజివ్” విధానాన్ని పాటిస్తేనే ప్రభుత్వానికి రక్షణ.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీరు మేడారంలో చరిత్ర సృష్టించడానికి వెళ్తున్నారు. ఆ చరిత్రను నలుగురే రాయాలా? లేక వందల మంది రాయాలా? అనేది మీ అధికారుల చేతిలో ఉంది. పది బస్సులు పెట్టి అందరినీ తీసుకెళ్లే “విశాల హృదయం” లేనప్పుడు.. ఈ సెలెక్టివ్ టూర్ల ఆర్భాటం ఆపేయడమే మంచిది. లేదంటే.. గొప్ప వార్త మరుగున పడి, అనవసరమైన విమర్శలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.
- పురుషోత్తం నారగౌని