National press day celebrated by TSJU
ఏసీపీలు రమేష్ కుమార్, వెంకటేష్
టిఎస్ జెయు ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం
హైదరాబాద్, నవంబర్ 16 :
జర్నలిస్టుల పాత్ర సమాజ నిర్మాణంలో అనితర సాధ్యమని హైదరాబాద్ సిసిఎస్ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఏసిపి వెంకటేష్ లు అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో నగరంలోని టీఎస్ జెయు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, సిసిఎస్ ఏసీపీ వెంకటేష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు నైతిక విలువలు పాటించాలని సూచించారు.
జర్నలిస్టుల పాత్ర సమాజ నిర్మాణంలో అనితర సాధ్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తెచ్చి సమాజానికి సరైన దిశ చూపడం జర్నలిస్టు ధర్మమని అన్నారు. అందుకు నైతిక విలువలు, జర్నలిస్టిక్ ఎథిక్స్ పాటించాలని సూచించారు. నిజా నిజాలను పరిశీలించి, ధృవీకరించి వార్తలను ప్రచారం చేయడం ద్వారా మీడియా విశ్వాసాన్ని నిలబెడుతుందని ఆయన సూచించారు. నేటి వేగవంతమైన సమాచార యుగంలో ఫేక్ న్యూస్ ఒక పెద్ద సవాలుగా మారిందని, దీనిని ఎదుర్కొనేది కూడా జర్నలిస్టులే కావాలని అన్నారు. వార్తల వేగం కన్నా వాటి నిజస్వరూపం ముఖ్యమన్నారు. ఒక జర్నలిస్టులో ఉన్న శక్తి సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. అందుకే సామాజిక బాధ్యతతో, వృత్తి పరమైన ప్రామాణికతతో పని చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం సిసిఎస్ ఏసీపీ వెంకటేష్ మాట్లాడుతూ పోలీస్–మీడియా మధ్య సమన్వయం చాలా కీలకమని పేర్కొన్నారు. కేసుల పరిశోధన, సామాజిక శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టులు అందించే సమాచార సహకారం అమూల్యమని అన్నారు. పోలీసులు, మీడియా రెండూ ప్రజల కోసం పని చేసే వ్యవస్థలన్నారు. ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, రక్షణ చట్టాల అవసరం, వేతన–సౌకర్యాల సమస్యలను ప్రస్తావించారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఉదయ భాస్కర్ ను ఘనంగా సన్మానించారు. టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వాసు, నేషనల్ జర్నలిస్టు యూనియన్ ఆఫ్ (ఇండియా) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో టీఎస్ జెయు రాష్ట్ర నాయకులు ముత్యం ముఖేష్ గౌడ్, ఆంజనేయులు, ఎండి రియాజ్, మెరుగు విష్ణు మోహన్, చంద్రమౌళి, మహేందర్, కొప్పుల వెంకటేష్, గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






