తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో-కల్చరల్ ఫెస్టివల్
మూడు రోజుల పాటు నగర ప్రజలను అలరించిన భిన్న కార్యక్రమాలు
తెలంగాణాకు ఈశాన్య రాష్ట్రాలకు మధ్య పటిష్టమైన సాంస్కృతిక సామీప్యత, చారిత్రకంగా, సామాజిక సామీప్యత చాలా ఉంది. ప్రధానంగా తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లలో వైవిధ్యమైన సాంస్కృతిక ఆచారాలు, ఉత్సవాలు,నృత్య రీతులు, భాషల మధ్య అత్యంత సాన్నిహిత్యం కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణా రాష్ట్ర సాధనకై జరిగిన సుదీర్ఘ పోరాటం తో 2014లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైనది. అదేవిధంగా, స్వయంపాలన, సంస్కృతి పరిరక్షణ, ఆత్మగౌరవ పాలనకై ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉద్యమాలు చేశాయి. ఫలితంగా నాగాలాండ్ 1963 లోనూ, మేఘాలయ 1972లో ఏర్పాటయ్యాయి. ఇక్కడి జానపదాల కళలు, చేనేతలకు మధ్య కూడా దగ్గరి సామీప్యత ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో దేశంలోనే అత్యధిక గిరిజన జనాభా ఉండగా తెలంగాణలోనూ ఆదివాసీ, లంబాడీ, గోండు, యానాది తదితర గిరిజన తెగలున్నాయి.
అయితే, ఈ ఇరు ప్రాంతాల మధ్య కళా, సాంస్కృతిక, చారిత్రక, క్రీడా, వ్యవసాయ సంస్కృతిక బంధం మరింత పటిష్ట అయ్యే విధంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, హైదరాబాద్ లో మొట్ట మొదటిసారిగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ కు రూపకల్పన చేయడమే కాకుండా, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అద్భుతంగా నిర్వహించారు. నవంబర్ 20 ,21 ,22 తేదీల మధ్య జరిగిన ఈ తెలంగాణ నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ నభూతో, నా భవిష్యత్ మాదిరిగా జరిగింది. కర్త, కర్మ, క్రియ అన్నీ తానుగా పర్యవేక్షించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ ఫెస్టివల్ విజయానికి పరోక్ష కారకులయ్యారు.
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు పాల్గొన్న ప్రారంభ సమావేశంతో మొదలైన ఈ మూడు రోజుల కళా, సాంస్కృతిక, క్రీడా, సామాజిక ఉత్సవం 22వ తేదీన ముగిసింది. ఫైన్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, లిటరేచర్, విమెన్ ఎంపవర్మెంట్, ఫిలిం ఫెస్టివల్, స్పోర్ట్స్ రంగాల్లో ఇరు ప్రాంతాల మధ్య ఉన్న బంధాన్ని తెలియచేసేవిధంగా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రధానంగా ఫైన్ ఆర్ట్స్ రంగంలో ఇరు ప్రాంతాలకు చెందిన పెయింటింగ్స్, ఫోటో ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు,సాహిత్య చర్చలు నిర్వహించారు. లిటరేచర్ లో సాహిత్య అకాడమీ గ్రహీతలైన గోరటి వెంకన్న, అలక్ నంద దాస్ గుప్త, అంపశయ్య నవీన్,అనిందయో రాయ్, గీతా రామస్వామి లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. మహిళా సాధికారత, స్పోర్ట్స్, ఫిలిం ఫెస్టివల్ లను అద్భుతంగా నిర్వహించారు. ప్రధానంగా, ఐమాక్స్ లో నిర్వహించిన ఫిలిం ఫెస్టివల్ లో త్రిపుర, సిక్కిం,అస్సామీ,మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల ప్రముఖ సినిమాలతోపాటు తెలంగాణాకు చెందిన బలగం, పొట్టెల్, నా బంగారు తల్లి, మల్లేశం లాంటి సినిమాలను ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో ప్రముఖ నటులు ప్రియాదర్షి, దిల్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ, సమాచార శాఖ కమీషనర్ ప్రియాంక, ఈశాన్య రాష్ట్ర నటులు, దర్శకులు పాల్గొన్నారు.తెలంగాణా- ఈశాన్య రాష్ట్రాల క్రీడలపై చర్చా గోష్ఠులు, ఫుట్ బాల్ ప్రదర్శన మ్యాచ్ లు అద్భుతంగా జరిగాయి. ప్రధానంగా, ఇరు ప్రాంతాలకు చెందిన సృజనాత్మకతను ప్రతిబింబించేలా నిర్వహించిన ఫ్యాషన్ షో హైలెట్ గా నిలిచింది. నవంబర్ 22 న హైటెక్స్ లో జరిగిన ముగింపు సమావేశంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లు పాల్గొనడంతో ఈ మూడు రోజుల కార్యక్రమాలు అద్భుతంగా ముగిశాయి. తిరిగి, రెండవ విడత కార్యక్రమాలు నవంబర్ 25 వ తేదీ నుండి 27 వరకు హైదరాబాద్ లో జరుగనున్నాయి.




