(రక్షించాల్సిన సంఘాలే భక్షిస్తే దిక్కెవరు? )
పురుషోత్తం నారగౌని
హైదరాబాద్: ఒక కలం.. చరిత్రను లిఖిస్తుంది. ఒక కలం.. అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది. ఒక కలం.. సమాజాన్ని మేల్కొల్పుతుంది. కానీ.. అదే కలం తన స్వజాతి గొంతు కోస్తే? చరిత్ర రాయాల్సిన కలమే.. సాటి జర్నలిస్టుల బతుకు అనే కాగితాన్ని నిర్దాక్షిణ్యంగా చింపేస్తే? ఇప్పుడు తెలంగాణ జర్నలిజం నడిబొడ్డున జరుగుతున్న ఘోరమిదే. “కంచే చేను మేసిన చందం” అనే సామెత మన యూనియన్ల తీరును చూస్తే చిన్నబోతుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది కేవలం మోసం కాదు.. నమ్మక ద్రోహం!
గత మూడు, నాలుగు దశాబ్దాలుగా జర్నలిస్టుల భుజాల మీద ఎక్కి, నినాదాలు ఇప్పించుకుని, మన శ్రమను పెట్టుబడిగ పెట్టి నాయకులుగా ఎదిగిన వారు.. ఈరోజు మన నెత్తి మీదే కుంపటి పెట్టారు. అక్రిడిటేషన్ కార్డు అనే ఒక చిన్న ప్లాస్టిక్ ముక్కను ఎరగా వేసి, వెనుక కోట్లాది రూపాయల సంక్షేమ నిధులను మింగేస్తున్న ‘ఆ మూడు’ సంఘాల (TUWJ-143, TUWJ (IJU), TWJF) పాపాలను కడిగేయాల్సిన సమయం ఆసన్నమైంది.
మారని రాత.. మారని పేర్లు రాజకీయాల్లో ప్రభుత్వాలు మారతాయి, ముఖ్యమంత్రులు మారుతారు. కానీ తెలంగాణ జర్నలిజం పాలిట శనిలా దాపురించిన ఆ యూనియన్ల పేర్లు మాత్రం మారవు.
జీవో 239 (2016): నాడు జర్నలిస్టుల పొట్టకొట్టిన ఈ జీవో వచ్చినప్పుడు కమిటీలో ఉండి, చాయ్ బిస్కెట్లు తింటూ సంతకాలు పెట్టింది ఎవరు? ఇదే యూనియన్ నాయకులు కాదా? అప్పుడు 143 యూనియన్ పెత్తనం చేస్తే, మిగతా తోక సంఘాలు వాటాలు పంచుకుని మౌనంగా ఉండిపోయాయి.
జీవో 252 (2025): నేడు “ప్రజా ప్రభుత్వం”లో వచ్చిన కొత్త జీవోలో మళ్ళీ కమిటీలో ఉన్నది ఎవరు? అదే పాత ముఖాలు! ఇప్పుడు IJU పెత్తనం చేస్తుంటే, 143 యూనియన్ మొసలి కన్నీరు కారుస్తోంది. వీరి నాటకంలో పాత్రలు మారాయేమో కానీ, కథ మాత్రం ఒక్కటే.. “సామాన్య జర్నలిస్టును అణచివేయడం”.
6 ఏళ్ల నిబంధన.. ఎవరి కోసం ఈ కంచె? తాజా జీవో 252లో ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన నిబంధనను చొప్పించారు. అక్రిడిటేషన్ కమిటీలో సభ్యత్వం కావాలంటే ఆ యూనియన్ రిజిస్టర్ అయి “కనీసం 6 ఏళ్లు” (atleast six years) అయి ఉండాలట. ప్రజాస్వామ్యంలో కొత్త సంఘాలు రాకూడదా? కొత్త గొంతుకలు వినిపించకూడదా? లేదు.. రాకూడదు! ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే.. పాత నాయకుల అవినీతి చిట్టా విప్పుతారు. అందుకే, మీడియా అకాడమీ ఛైర్మన్ కనుసన్నల్లో, ఈ పాత సంఘాలు సిండికేట్ గా మారి, కొత్తవారికి ద్వారాలు మూసేసే కుట్ర ఇది. ఇది కచ్చితంగా ప్రభుత్వానికి తెలియకుండా, అధికారులను తప్పుదోవ పట్టించి రాయించుకున్న నిబంధన.
కోట్లు కురిపించిన ప్రకటనలు.. జేబులు నింపిన వాటాలు మిత్రులారా! ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ వార్తలు రాస్తే, పత్రికలకు ప్రకటనలు (Ads) వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఒక స్పష్టమైన నిబంధన ఉంది – “ప్రభుత్వ ప్రకటనల మొత్తం నుంచి 2 శాతం (2%) నిధులను కట్ చేసి, జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కు జమ చేయాలి.”
గత పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల ప్రకటనలు విడుదల చేసింది.
ఆ లెక్కన చూసుకుంటే.. ఈపాటికి “జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్”లో వందల కోట్లు నిల్వ ఉండాలి కదా?
ఆ డబ్బు ఏమైంది? ఏ బ్యాంక్ ఖాతాలో మూలుగుతోంది?
కమిటీల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ నాయకులు ఈ లెక్కలను ఎందుకు అడగరు? “మీ వాటా మీకు.. మా వాటా మాకు” అనే చీకటి ఒప్పందం ఏదైనా జరిగిందా?
300 కోట్ల కార్పస్ ఫండ్ మాయాజాలం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా.. “జర్నలిస్టులకు 100 కోట్లు కాదు, 300 కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తాం” అని ప్రకటించినప్పుడు, మన నాయకులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పాలాభిషేకాలు చేశారు, స్వీట్లు పంచుకున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను.. ఆ 300 కోట్లు వచ్చాయా?
కనీసం ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, ఏడాదికి రూ. 20 కోట్ల వడ్డీ (Interest) వచ్చేది.
ఆ వడ్డీ డబ్బుతో ఎంతమంది జర్నలిస్టులకు ఇళ్లు కట్టించారు?
క్యాన్సర్, గుండెజబ్బులతో బాధపడుతున్న ఎంతమందికి ఆపరేషన్లు చేయించారు?
కరోనా కల్లోలంలో జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతే, ఈ కార్పస్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి ఎందుకు బయటకు రాలేదు?
నిధులు రాలేదని తెలిసీ.. ప్రభుత్వాన్ని నిలదీస్తే తమ పదవులు ఊడతాయని, తమకు వచ్చే నజరానాలు ఆగుతాయని మౌనంగా ఉండిపోయిన ఈ నాయకులను ఏమనాలి? ఇది ద్రోహం కాదా?
అల్లమన్నకు అందినంత.. అందరికీ అందాలి కదా! మీడియా అకాడమీ చైర్మన్లుగా, యూనియన్ లీడర్లుగా ఉన్నవారికి జబ్బు చేస్తే.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో, ఏసీ గదుల్లో రాజభోగాలతో వైద్యం అందుతుంది. ప్రభుత్వం లక్షల రూపాయల బిల్లులు తక్షణం చెల్లిస్తుంది. సంతోషం, వారి ప్రాణం దక్కాల్సిందే. కానీ.. మన తోటి సహచరుడు, నల్గొండ జిల్లాకు చెందిన ఒక దళిత జర్నలిస్ట్ బిడ్డ, క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ, చికిత్సకు పైసలు లేక, ప్రభుత్వ ఆసుపత్రి వరండాలో (అప్పటికి మేము కొట్లాడితే తీసుకెళ్లారు) దిక్కులేక చనిపోతే.. ఈ అకాడమీ పెద్దలు ఏమయ్యారు? ఈ వెల్ఫేర్ ఫండ్ నిధులు ఏమయ్యాయి? “నాయకుడి ప్రాణానికి ఒక విలువ.. కార్యకర్త ప్రాణానికి ఒక విలువనా?” బతికున్నప్పుడు మందులకు పైసలు ఇప్పించలేని నాయకులు, ఆ జర్నలిస్ట్ చనిపోయాక మాత్రం శవం దగ్గరికి వచ్చి, “మా సంఘం తరఫున సాయం చేశాం” అని ఫోటోలకు ఫోజులివ్వడం.. శవాల మీద పేలాలు ఏరుకోవడం కాక మరేమిటి?
చదువుకున్న సన్నాసులు! రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు, కార్పొరేషన్ ఛైర్మన్లుగా ఉన్నప్పుడు తటస్థంగా (Neutral) ఉండాలనే కనీస ధర్మం కూడా తెలియని “చదువుకున్న సన్నాసులు” మన నాయకులు. గతంలో అల్లం నారాయణ గారు అకాడమీ ఛైర్మన్ గా ఉండి 143 యూనియన్ ను నడిపించారు. ఇప్పుడు కె. శ్రీనివాస్ రెడ్డి గారు ఛైర్మన్ గా ఉండి IJU నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కుర్చీ ఎక్కినా కండువా విప్పని ఈ మనస్తత్వమే జర్నలిజాన్ని భ్రష్టు పట్టించింది.
ఇది ఆత్మగౌరవ సమరం ఇక చాలు. మౌనంగా భరించింది చాలు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన వ్యవస్థ మారదు. వ్యవస్థను పట్టి పీడిస్తున్న ఈ ‘జలగలను’ వదిలిస్తేనే సామాన్య జర్నలిస్టుకు న్యాయం జరుగుతుంది.
అక్రిడిటేషన్ కార్డుల భిక్ష మాకు వద్దు.. మాకు రావలసిన సంక్షేమ నిధుల లెక్కలు మాకు కావాలి.
కనీస వేతనాల చట్టం అమలు చేయాలి
జర్నలిస్టులకు ఉద్యోగ భధ్రత కావాలి
హెల్త్ కార్డులు పని చేయాలి.
పెన్షన్ మా హక్కుగా రావాలి.
చిన్న పత్రికలను డిజిటల్ మీడియాను బతికించాలి.
ఈ ఆవేదనలో నుంచి పుట్టిందే ఈ కథనాల పరంపర. రాబోయే వారం రోజులు.. అంకెలతో సహా, ఆధారాలతో సహా, ఒక్కో రంగాన్ని, ఒక్కో మోసాన్ని ‘పోస్ట్ మార్టం’ చేద్దాం. ఇది ఒక వ్యక్తి పోరాటం కాదు.. ఇది తెలంగాణ జర్నలిస్ట్ ఆత్మఘోష!