- విలువలకు సజీవ సాక్ష్యం ‘పొన్నం’ ఇల్లు! – గుత్తా సుఖేందర్ రెడ్డి
- రవీంద్రభారతిలో ఉద్వేగభరితంగా పొన్నం సత్తయ్య 16వ వర్ధంతి సభ
- తెలంగాణ పార్లమెంటు పోరాటాలను నెమరువేసుకున్న మంత్రులు
- ఎం. కోదండరెడ్డి, వెలిచాల కొండలరావు, గొట్టె కనకవ్వలకు ‘జీవన సాఫల్య’ పురస్కారాలు
- ఆకట్టుకున్న సత్తయ్య గారి అరుదైన చిత్రమాలిక
“ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నమే నేటి సమాజంలో పెరుగుతున్న ఆత్మహత్యలకు ప్రధాన కారణం. కష్టమొచ్చినా.. కన్నీరొచ్చినా పంచుకునే ఆత్మీయ బంధాలు ఇంట్లో కరువవడం వల్లే రైతులు, సామాన్యులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆధునికత పేరుతో బంధాలు తెగిపోతున్న ఈ స్వార్థపూరిత రోజుల్లో.. ముగ్గురు కొడుకులు అత్యున్నత స్థాయికి ఎదిగినా నేటికీ ఉమ్మడి కుటుంబంగా ఒకేతాటిపై నడుస్తున్న ‘పొన్నం’ ఇల్లు యావత్ సమాజానికే ఆదర్శం” అని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. జీవితాంతం పార వదలకుండా కరీంనగర్ మట్టిని నమ్ముకుని బతికిన శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ 16వ వర్ధంతి సభ ఆదివారం రవీంద్రభారతిలో అక్షరాలా ఒక విలువల పాఠశాలను తలపించింది. శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ‘జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం-2026’ అనేక మంది ప్రముఖుల భావోద్వేగాల మధ్య అత్యంత ఘనంగా ముగిసింది. సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సత్తయ్య గారి అరుదైన చిత్రమాలిక విశేషంగా ఆకట్టుకుంది.
బంధాలు తెగిపోతున్న సమాజానికి ‘పొన్నం’ కుటుంబమే ఆదర్శం: గుత్తా సుఖేందర్ రెడ్డి
ఆనాడు పార్లమెంటు మెట్ల మీద పడుకున్నాం:
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమ స్మృతులను నెమరువేసుకున్నారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభాకర్, వివేక్ ఇద్దరూ ఐదు రోజుల పాటు పార్లమెంటు మెట్ల మీద పడుకుని పోరాడారు. మా పోరాటం చూసి ఆనాడు సోనియా గాంధీ గారు స్వయంగా పిలిచి తెలంగాణ ఇస్తామని మాకు హామీ ఇచ్చారు. అదొక మరువలేని ఘట్టం. నేను కూడా నిత్యం వ్యవసాయం చేస్తాను, ఆర్గానిక్ వ్యవసాయంలో ఏమైనా సలహాలు కావాలంటే రైతులు నా క్షేత్రానికి రావచ్చు” అని ఆయన ఆహ్వానించారు.
సభలో 15 నిమిషాలు ఏకధాటిగా నినాదాలు: వివేక్ వెంకటస్వామి (రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి)
“ఉద్యమ సమయంలో లోక్సభలో అందరం ఐదు నిమిషాలు నినాదాలు చేస్తే, పొన్నం ప్రభాకర్ ఒక్కడే ఏకధాటిగా 15 నిమిషాల పాటు గొంతెత్తి గర్జించేవాడు. ఆ పోరాట పటిమ, గంభీరమైన గొంతు ఆయనకు వారి తండ్రి సత్తయ్య గారి నుంచే అబ్బాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో ఓడిపోయి, పదేళ్ల పాటు అధికారంలో లేకపోయినా ఈ కుటుంబం తట్టుకుని నిలబడిందంటే దానికి కారణం వారు కలిసి ఉండటమే. ఉమ్మడి కుటుంబంలో ఉండే ఓర్పు, సర్దుకుపోయే తత్వం వల్లే ఇది సాధ్యమైంది.”
తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి అదే: జూపల్లి కృష్ణారావు (రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి)
“తల్లిదండ్రులు మనకు ఆస్తులు బాగా ఇవ్వొచ్చు.. కానీ అంతకంటే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది ఆలోచనా విధానం, ధైర్యం, పట్టుదల, కష్టాలు వచ్చినప్పుడు ఒకరినొకరు ఆదుకునే తత్వాన్ని ఇవ్వడం. పొన్నం సత్తయ్య గారు తమ పిల్లలకు ఇచ్చిన గొప్ప సంపద అదే. 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో రైతుల ఆత్మహత్యలపై మాట్లాడాను. రాకెట్లు పంపుతున్న మనం పొలాలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని ప్రశ్నించాను. కుటుంబంలో ఓదార్పు కరువవడమే అప్పటి చావులకు ప్రధాన కారణం. అందుకే పొన్నం కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.”
ఆ ‘రుమాలు’ ఎప్పటికీ గుర్తుంటుంది: మహేష్ కుమార్ గౌడ్ (టీపీసీసీ అధ్యక్షులు)
“తన కన్నా పిల్లలు ప్రయోజకులైనప్పుడే ఏ తండ్రి జీవితమైనా ధన్యం అవుతుంది. దురదృష్టవశాత్తు 2010లో సత్తయ్య గారు స్వర్గస్తులైనా, ఆయన ఆశయాలను పెద్ద కొడుకు అశోక్ న్యాయవాదిగా, రెండో కొడుకు రవిచంద్ర జర్నలిజంలో, మూడో కొడుకు ప్రభాకర్ రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. నేను చిన్నప్పుడు కరీంనగర్ వెళ్ళినప్పుడు, తలపాగా (రుమాలు) చుట్టుకుని, వ్యవసాయం చేసుకుంటూ చిరునవ్వుతో కనిపించే సత్తయ్య గారి రూపం నా కళ్లముందే ఉంది.”
పేద విద్యార్థులకు భరోసానివ్వాలి: అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (రాష్ట్ర sc మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి)
“ప్రభాకర్ అన్నతో నాకు ఎన్ఎస్యూఐ రోజుల నుంచి పరిచయం ఉంది. ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ముగ్గురు అన్నదమ్ములు అదే ప్రేమతో కలిసి ఉండటం అద్భుతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు ‘పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఆర్థిక సాయం అందించి అండగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.”
ఇది యావత్ రైతాంగానికి దక్కిన గౌరవం: ఎం. కోదండరెడ్డి (రైతు కమిషన్ చైర్మన్, పురస్కార గ్రహీత)
“వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నన్ను గుర్తించి సత్కరించడం రాష్ట్రంలోని రైతాంగాన్నంతటినీ సన్మానించినట్లుగా భావిస్తున్నాను. ఆనాడు కౌలు రైతులను ఆదుకునేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన చట్టాన్ని, నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. నేడు దళారుల చేతిలో మోసపోతున్న రైతులను సంఘటితం చేయడానికే ప్రభుత్వం ‘అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్’ వేసింది.”
అక్షరం రాకపోయినా.. బతుకు పాఠం నేర్పారు: పొన్నం ప్రభాకర్ (రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి)
“మాది నూటికి నూరు శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబం. మా తల్లిదండ్రులిద్దరికీ అక్షరం రాదు. కానీ, వ్యసనాలకు బానిసలు కాకుండా సమాజంలో తలెత్తుకుని గౌరవంగా ఎలా బతకాలో మా ముగ్గురు అన్నదమ్ములకు వాళ్లు నేర్పించారు. ఈ రోజు మేము ఏ స్థాయికి చేరినా దానికి కారణం వారిచ్చిన క్రమశిక్షనే. బయట ఫంక్షన్ హాళ్లు అవసరం లేకుండా, ఇంట్లోనే పండుగ చేసుకునేంత ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం మాది. ఆ తండ్రి ఆశయాలతోనే నేడు ముగ్గురు మహామహులకు ఈ జీవన సాఫల్య పురస్కారాలు అందజేస్తున్నాం.” అని పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు
ఈ ప్రతిష్టాత్మక వేదికపై సత్తయ్య గారి సతీమణి పొన్నం మల్లమ్మ గారు ఆసీనులూకాగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పొన్నం అశోక్ గౌడ్,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జ్యూరీ కమిటీ సభ్యులు మాడభూషి శ్రీధర్, దిలీప్ రెడ్డి, శ్యాంప్రసాద్, మామిడి హరికృష్ణ, రవిచంద్ర, ఐనంపూడి శ్రీలక్ష్మిని మంత్రులు అభినందించారు. వ్యాఖ్యాతలు మడిశెట్టి గోపాల్, ఐనంపూడి శ్రీలక్ష్మి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు నడిపించారు. పొన్నం రవిచంద్ర వందన సమర్పణతో ఈ విలువల పండుగ ముగిసింది.
కాగా రవీంద్ర భారతి . సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సత్తయ్య గారి అరుదైన చిత్రమాలిక (Photo Exhibition) విశేషంగా ఆకట్టుకుంది. ఆయన వ్యవసాయ పనుల్లో ఉన్నప్పటి దృశ్యాలు, నిరాడంబర జీవితాన్ని ప్రతిబింబించే ఛాయాచిత్రాలు ఆహూతులను గతం లోకి తీసుకెళ్లాయి.
ఈ ఏడాది (2026) పురస్కార గ్రహీతల పరిచయం!
ఎం. కోదండరెడ్డి (వ్యవసాయ రంగం):
దశాబ్దాలుగా రైతుల పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేస్తున్న అచ్చమైన రైతు నాయకుడు. ప్రస్తుతం రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్. రైతుల శ్రేయస్సు కోసమే నిరంతరం తపించే ఆయన నిస్వార్థ సేవలకు దక్కిన గుర్తింపు ఈ పురస్కారం.
వెలిచాల కొండలరావు (సాహిత్య రంగం):
95 ఏళ్ల వయసులోనూ అక్షర సేద్యం చేస్తున్న నవ యువకుడు. కవిగా, అనువాదకుడిగా దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. నేటి యువ రచయితలకు ఆయనొక సజీవ గ్రంథాలయం.
గొట్టె కనకవ్వ (జానపద కళారంగం):
ఎలాంటి సంగీత శిక్షణ లేకుండానే, పల్లె పదాలనే ప్రాణంగా చేసుకుని ‘యూట్యూబ్ సెన్సేషన్’గా మారిన జానపద కోకిల. అంతరించిపోతున్న తెలంగాణ జానపద కళకు జీవం పోస్తూ కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న అచ్చమైన కళాకారిణి.
గత పురస్కార గ్రహీతలు వీరే..
సత్తయ్య గారి ఆశయాలను బతికించుకునే క్రమంలో, గత నాలుగేళ్లుగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన దిగ్గజాలను ట్రస్ట్ సత్కరిస్తూ వస్తోంది:
2022: ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం, కళాకారుడు బొగ్గు ధర్మయ్య
2023: బహుభాషా కవి సలిమెల భాస్కర్, విప్లవ గాయని విమలక్క
2024: ఆస్కార్ అవార్డు గ్రహీత, గేయ రచయిత చంద్రబోస్, బలగం కొమరయ్య
2025: ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, జానపద గాయని అంతడుపుల రమాదేవి
– పురుషోత్తం గౌడ్ నారగౌని (8897388393)















