కొడుకులు శిఖరాలెక్కినా.. నేల మీదే నడిచిన నిజాయితీ!
(శ్రీ పొన్నం సత్తయ్య గారి 16వ వర్ధంతి సందర్భంగా అక్షర నివాళి)
విజయానికి అసలైన కొలమానం ఏమిటి? ఈనాటి సమాజంలో ఎంత సంపాదించారు, ఎంత పేరు తెచ్చుకున్నారు, ఎంతమంది పరివారంతో తిరుగుతున్నారు అనేదే విజయానికి గీటురాయిగా మారిపోయింది. పదవి రాగానే పాత పరిచయాలు మరిచిపోయి, చిన్న విజయానికే ప్రచారం కోసం ఆరాటపడే మనుషుల మధ్య.. ఒక నిరక్షరాస్యుడైన రైతు, తన నిజాయితీ ఒక్కదానితోనే సమాజం మనసులో శాశ్వతంగా ఎలా నిలిచిపోగలిగారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నేడు (సెప్టెంబర్ 13) ఆయన 16వ వర్ధంతి. భౌతికంగా ఆయన దూరమై పదహారేళ్లు గడిచినా, ఆయన మిగిల్చిన విలువలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. మారుతున్న కాలంతో పాటు మారని కొన్ని విలువలు ఉంటాయని, అవే మనిషిని చరిత్రలో నిలబెడతాయని పొన్నం సత్తయ్య గారి జీవితం రుజువు చేస్తుంది.
- నా కొడుకులు నాకు మంచి పేరు తీసుకువచ్చారు, ఇదే నాకు వాళ్ళ ఆస్తి.”
- “బట్ట మీద మరక పడితే ఉతుకుతే పోతుంది, మనిషి మీద మరక పడిపోతే పోదు.”
- “బిడ్డా, మీరేం చేసినా చదువును మాత్రం విడవద్దు.”
- “నాకు వ్యవసాయం అంటే ఇష్టం. ఆవులను చూసుకోవడం అంటే ఇష్టం. మనకు నచ్చిన పని చేస్తూనే ఉండాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం.”
– పొన్నం సత్తయ్య గౌడ్
ఎవరి పని వాళ్లదే.. నాకు మట్టే హాయి!
సత్తయ్య గారి కుమారులు ముగ్గురూ మూడు భిన్నమైన రంగాల్లో శిఖరాగ్రానికి చేరుకున్నారు. అశోక్ న్యాయవాదిగా, రవిచంద్ర సాహిత్య రంగంలో, ప్రభాకర్ రాజకీయాల్లో (ప్రస్తుత రాష్ట్ర మంత్రిగా) అంచెలంచెలుగా ఎదిగారు. సామాన్యంగా ఇంట్లో ఒక ఎంపీనో, మంత్రో ఉంటే.. ఆ కుటుంబం చుట్టూ ఉండే హడావుడి, భద్రతా వలయాలు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. కానీ సత్తయ్య గారు వీటన్నింటికీ అతీతుడు. కొడుకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో, ఇంటికి ఎవరైనా వచ్చి “బాపూ.. మీ కొడుకు ఎంపీ కదా! మీరెందుకు ఇంకా ఈ మట్టిలో పనిచేయడం?” అని అడిగితే.. ఆయన పెదవులపై చెరగని చిరునవ్వుతో చెప్పిన సమాధానం ఒక్కటే.. “ఎవరి పని వాళ్లదే బిడ్డా! రోజూ పొద్దున లేచి పొలం కాడికి పోయి వస్తేనే నాకు హాయి”. విజయాలు వారసులవి కావొచ్చు, కానీ తన మూలాలు మాత్రం మట్టివే అని బలంగా నమ్మిన ఆయన ఆచరణ.. నేటి తరం నాయకులకు ఒక పెద్ద గుణపాఠం.
చదువు లేని జ్ఞాని.. బడులు నేర్పని పాఠం
సత్తయ్య గారిది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి నేలతోనే సావాసం. సొంత అన్నదమ్ములు చదువుకున్నా, ఆయనకు మాత్రం అక్షరం ముక్క రాలేదు. కానీ, నిరక్షరాస్యుడైనా సత్తయ్య గారికి లోకజ్ఞానంలో ఏ లోటూ ఉండేది కాదు. అరవయ్యేళ్ళ పాటు ఆయనకు అత్యంత నమ్మకమైన నేస్తం రేడియో. పొలం పనిలో ఉన్నా నడుముకు రేడియో కట్టుకుని వార్తలు వినేవారు. అక్షరం రాకపోయినా, జ్ఞానతృష్ణ ఉంటే ఏ మనిషైనా ఎదగగలడని ఆయన నిరూపించారు. దానికి నిదర్శనం.. తనకు దక్కని చదువును తన పిల్లలకు అందించడానికి శాయశక్తులా కృషి చేసిన ఆయన, ఎవరి మీదా తన ఇష్టాన్ని రుద్దలేదు. ఏ కార్పొరేట్ స్కూళ్లో లేకుండా, ప్రభుత్వ బడుల్లోనే కొడుకులను చదివించి ప్రయోజకులను చేశారు. చదువు స్థాయి కాదు, చదువుపై ఉన్న శ్రద్ధ ముఖ్యమని ఆయన నమ్మారు.
కంచు పళ్ళెం.. చెక్కుచెదరని విలువలు
ఆయన జీవితాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఆయనే అన్న ఈ మాట చాలు.. “బట్ట మీద మరక పడితే ఉతికితే పోతుంది, కానీ మనిషి మీద మరక పడిపోతే ఇక పోదు”. డబ్బు పోతుంది, పదవి పోతుంది, కానీ మనిషి మీద పడ్డ మచ్చ శాశ్వతంగా వెంటాడుతుందనేది ఆయన నమ్మిన కచ్చితమైన సూత్రం. నలభై ఏళ్ళపాటు ఆయన ఒకే కంచు పళ్ళెంలో భోజనం చేశారు. ఉన్నదానితో తృప్తిగా బతికారు. ఇది పిసినారితనం కాదు, ఒక విలువలు తెలిసిన మనిషి జీవన విధానం. కొత్త వస్తువుల మీద మమకారం కంటే, ఉన్న వాటితో ఏర్పడ్డ అనుబంధం మీద నమ్మకం ఎక్కువగా ఉన్న మనిషి ఆయన.
ఇంటి వంట.. ఉమ్మడి కుటుంబం
“ఇంటి వంట ఒంటికి మంచిది” అన్నది కేవలం సామెత కాదు, సత్తయ్య గారి కుటుంబ నిర్మాణ సూత్రం. ఉమ్మడి భోజనం, ఉమ్మడి జీవనం ఆయనకు నచ్చిన మార్గం. ఇంట్లో ఉన్నప్పుడు ముగ్గురు కొడుకులు, కోడళ్లు, మనుమలు అందరూ కలిసి భోజనం చేయడం, కలిసి నిర్ణయాలు తీసుకోవడం సత్తయ్య గారు వారికి నేర్పిన సంస్కారం. రక్తసంబంధం లేని వారిని కూడా సొంతవారిగానే చూసిన సత్తయ్య గారిని గ్రామస్థులు ‘బాపు’, ‘మామయ్య’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఎవరికి కష్టం వచ్చినా చిరునవ్వుతో ముందుకొచ్చి సాయం చేసేవారు.
కొనసాగుతున్న వారసత్వం..
ఆయన ఏనాడూ వేదికలపై ఉపన్యాసాలు ఇవ్వలేదు, పుస్తకాలు రాయలేదు. పిల్లలకు నీతులు వల్లె వేసి నేర్పలేదు, స్వయంగా ఆచరించి చూపారు. ఆయన జ్ఞాపకార్థం స్థాపించిన ‘పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు’ ఆ నిరాడంబర వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఈ ఏడాది (2026) కవి వెలిచాల కొండలరావు, జానపద గాయని గొల్లె కనకవ్వలతో పాటుగా.. రైతుల పక్షాన నిరంతరం పోరాడే రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డికి ‘జీవన సాఫల్య పురస్కారం’ అందిస్తుండటం సత్తయ్య గారి ఆశయాలకు ఇస్తున్న నిజమైన గౌరవం.
ఇవాళ ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ గురించి కొత్తగా మాట్లాడుకుంటున్నాం, కానీ సత్తయ్య గారు తెల్లవారుజామునే లేవడం, పొలం పనికి వెళ్లడం, క్రమం తప్పకుండా రేడియో వినడం, కుటుంబంతో గడపడం.. ఇలా తనకంటూ ఒక క్రమశిక్షణను ఎప్పుడో ఆచరణలో చూపారు. ఒక వ్యక్తి ఎంత సంపాదించాడన్నది కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ, ఎలా జీవించాడన్నది తరతరాలుగా నిలిచిపోతుంది. అధికారం ఇంటిని చేరినా ఆర్భాటాలకు పోకుండా, అనుభవంతో వివేకం సంపాదించి, నిజాయితీగా జీవించిన సత్తయ్య గారి జీవితం.. ఈనాటి సామాజిక, రాజకీయ వ్యవస్థకు ఎప్పటికీ ఒక శాశ్వత దిక్సూచి.
“బాపూ… నా ప్రతి అడుగులో నీవున్నావు!”
“పుట్టినప్పటి నుంచి 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ అన్ని తానే అయి… ఉదయం 5 గంటలకు లేచి మొదలు రాత్రి 9 గంటల వరకు నిరంతరం మా కోసం శ్రమించి… ఏ రోజు డైరెక్ట్‌గా ఒక మాట కూడా అనకుండా ఏ విషయమైనా అమ్మతోటి చెప్పించేవాడివి.” నీకు పిల్లలపై గల అభిమానాన్ని, ప్రేమను మా తోటలో నీవు నాటిన పండ్ల చెట్లను చూస్తే తెలుస్తుంది: “నీవు పెంచిన అనే వాడివి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్నిరకాల పండ్లు మరియు ధాన్యాలు అందించాలని! నీవు పండించిన పండ్లు మేము తింటుంటే నీ ఆనందం చెప్పలేనిది.”

– పొన్నం అశోక్ గౌడ్
మా బాపు ‘భూమి పుత్రుడు’
“సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ‘భూమి పుత్రుడు’ మా బాపు. భూమిని నమ్ముకున్న పడిపాటల సహకారంతో మా కుటుంబ సభ్యుల బంగారు భవిష్యత్తుకు దారి వేసిన మార్గదర్శి. తాను చదువుకోకపోయినా, మమ్మల్ని ఉన్నత చదువులు చదివించి, జీవితసారాన్ని చెప్పుకోకనే చెప్పిన బాధ్యతాయుత బోధకుడు.”

పొన్నం రవిచంద్ర గౌడ్
“బాపు మా మార్గదర్శి”
“నేను పుట్టిన నాడు పాతబజారులోని ఇంట్లో మా అమ్మనాన్న, తాతల్తో ఉండేవాళ్ళం. తదుపరి వ్యవసాయ క్షేత్రాలు అయిన మంకమ్మతోటకు నివాసం మారాం. ఆ తరువాత తన జీవితం ముగింపు వరకు ఆ వ్యవసాయ క్షేత్రాలను నమ్ముకుని, మమ్మల్ని సమాజంలో గౌరవంగా బతికే విధంగా, తండ్రిగా బాధ్యతలు కొనసాగించారు.”
“తనకు, అమ్మకు చదువు రాకున్నా, మేమందరం ఉన్నత విద్యావంతులు కావాలన్న లక్ష్యంతో మా అందరినీ ప్రోద్బలించారు… ఏ దురాలోచనైనా తీర్చిదిద్దే విధంగా కుటుంబ పెద్దగా తన బాధ్యతలను నిర్వర్తించారు.”
“నేను పుట్టిన నాడు పాతబజారులోని ఇంట్లో మా అమ్మనాన్న, తాతల్తో ఉండేవాళ్ళం. తదుపరి వ్యవసాయ క్షేత్రాలు అయిన మంకమ్మతోటకు నివాసం మారాం. ఆ తరువాత తన జీవితం ముగింపు వరకు ఆ వ్యవసాయ క్షేత్రాలను నమ్ముకుని, మమ్మల్ని సమాజంలో గౌరవంగా బతికే విధంగా, తండ్రిగా బాధ్యతలు కొనసాగించారు.” “తనకు, అమ్మకు చదువు రాకున్నా, మేమందరం ఉన్నత విద్యావంతులు కావాలన్న లక్ష్యంతో మా అందరినీ ప్రోత్సహించారు

