తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌లో విద్యారంగానికి ఒక చారిత్రాత్మక మరియు దార్శనిక పీట వేసింది. “విద్య లేని వాడు వింత పశువు” అన్న మహాత్య్ముల మాటలను నిజం చేస్తూ, ప్రతి బిడ్డకు ఉన్నతమైన, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించబడింది. విద్యారంగానికి ప్రభుత్వం ఈసారి ఏకంగా ₹26,674 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప మలుపుగా నిలిచిపోతుంది. ఈ బడ్జెట్ కేవలం అంకెల సమ్మేళనం కాదు; ఇది తెలంగాణ భవిష్యత్తు తరాల తలరాతను మార్చే ఒక సమకాలీన దార్శనిక పత్రం. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా, అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయడమే ఈ భారీ కేటాయింపుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం. చదువు అనేది ఒక ఖర్చు కాదు, అది రాష్ట్రం తన భవిష్యత్తుపై చేసుకుంటున్న అత్యున్నతమైన సామాజిక పెట్టుబడి అని ఈ బడ్జెట్ నిరూపించింది.
ఈ విద్యా బడ్జెట్‌లో అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మక మార్పుగా “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ (YIIR) పాఠశాలలను” పేర్కొనవచ్చు. తెలంగాణ సమాజం ఒక ఉమ్మడి వసుధైక కుటుంబంగా ఎదగాలనే సంకల్పంతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఓసీ విద్యార్థులందరూ ఒకేచోట, ఒకే విధానాన చదువుకునేందుకు వీలుగా ఈ 105 పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనివల్ల చిన్న వయసులోనే విద్యార్థుల మధ్య కుల, మత వివక్షలు తొలగిపోయి, ఒక సామాజిక సమసమానత్వ పునాది పడుతుంది. ఇప్పటికే 79 స్కూళ్లు మంజూరు కాగా, 44 చోట్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇది రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని (Social Justice) అందించే దిశగా ప్రభుత్వం వేసిన ఒక గొప్ప అడుగు. ఈ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, డిజిటల్ తరగతి గదులు మరియు అత్యాధునిక క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు.
పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల పోషణ మరియు ఆరోగ్యం పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. దీనిలో భాగంగా భారతదేశంలోనే తొలిసారిగా “బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని” ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ విస్తరించారు. ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు మరియు మూడు రోజులు రాగిజావ అందించడం వల్ల వారి మెదస్సు మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది. “తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ కూడా ఆకలితో స్కూలు రోజువారీ పనులను మొదలుపెట్టకూడదు” అనే ప్రభుత్వ సంకల్పం ఎంతో మానవీయమైనది. ఈ కార్యక్రమం వల్ల స్కూళ్లలో హాజరు శాతం పెరగడమే కాకుండా, మధ్యలోనే చదువు మానేసే (Dropouts) విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. దీనితోపాటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు కూడా ఈసారి నుండి మధ్యాహ్న భోజన పథకాన్ని (Mid-day meal) విస్తరించారు. కౌమార దశలో ఉండే ఇంటర్ విద్యార్థులకు పోషకాహారం ఎంతో అవసరం అనే వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వాన్ని ఎంతో అభినందించాలి. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద విద్యార్థులకు గొప్ప ఊరట లభిస్తుంది.
అదేవిధంగా, “తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు” అనే నూతన విధానంతో ప్రభుత్వ స్కూళ్లను అత్యున్నత మౌలిక వసతులు, డిజిటల్ సదుపాయాలు మరియు ప్రత్యేక రవాణా వ్యవస్థలతో కూడిన క్యాంపస్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్ లో 1500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం దీని లక్ష్యం. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 93 కె.జి.బి.వి (KGBV) లను “యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్” గా మార్చారు మరియు మరో 120 కె.జి.బి.వి లను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ఆడపిల్లలు ఉన్నత చదువులకు దూరం కాకుండా రక్షణ లభిస్తుంది. దివ్యాంగ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎటువంటి అడ్డంకి కలుగకూడదు అనే లక్ష్యంతో, ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ‘రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్’ వాహనాలను అందజేస్తున్నారు. పాఠశాలల్లోని వంటశాలల ఆధునీకరణకు (Kitchen modernization) బడ్జెట్‌లో ₹100 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. దీనివల్ల విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో వండిన ఆరోగ్యకరమైన భోజనం అందుతుంది.
ఉన్నత విద్య మరియు విశ్వవిద్యాలయాల (Universities) అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మౌలిక వసతుల కల్పన కోసం ఏకంగా ₹1000 కోట్ల రూపాయలు, మరియు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి ₹400 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఇవే కాకుండా పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలో కొత్తగా ఇంజనీరింగ్, లా మరియు ఫార్మసీ కళాశాలలను మంజూరు చేసి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో “డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ” ని స్థాపించడం వల్ల భూగర్భ శాస్త్ర రంగంలో పరిశోధనలకు గొప్ప అవకాశం కలుగుతుంది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కూడా తోడ్పాటు లభిస్తుంది. ఉన్నత విద్యలో నాణ్యతను పెంచడం ద్వారా తెలంగాణను దేశానికే విద్యా హబ్‌గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
సాంకేతిక విద్య (Technical Education) మరియు నైపుణ్యాల (Skills) పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేటి పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా “అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ATC)” గా ఉన్నతీకరించడమే కాకుండా, మరో 53 ఏటీసీలను కొత్తగా మంజూరు చేశారు. వెరసి 118 ఏటీసీలు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ కేంద్రాలలో శిక్షణ పొందే ట్రైనీలకు నెలకు ₹2,000 స్టైపెండ్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం నిరుద్యోగ యువతకు గొప్ప ప్రోత్సాహం. అటు విద్యావంతులైన నిరుద్యోగుల సమస్యలను, ఇటు పరిశ్రమల అవసరాలను ఒకేసారి తీర్చే దిశగా “యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ” ని స్థాపించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే మహా సంకల్పంతో, లక్షలాది మంది నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేయడమే దీని లక్ష్యం.
పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రతి దశలోనూ పారదర్శకతను మరియు జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌ను ప్రోత్సహిస్తోంది. స్కూళ్లలో టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, వారి నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను రూపొందించారు. విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి, కేవలం విద్యా ప్రమాణాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు సకాలంలో ఖర్చు అయ్యేలా ఒక పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ప్రశంసించదగ్గ విషయం. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచడం ద్వారా మధ్యతరగతి మరియు పేద వర్గాలపై విద్యా ఖర్చుల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
మొత్తానికి చూస్తే, ఈ 2026-27 విద్యా బడ్జెట్ కేవలం ఒక ఖర్చు కాదు, అది రాష్ట్ర భవిష్యత్తు పైన చేసిన ఒక గొప్ప సామాజిక పెట్టుబడి. అమ్మ కలలు, పిల్లల చదువు – ఇవే తెలంగాణ భవిష్యత్తు అనే దార్శనికత ఈ బడ్జెట్‌లో ప్రతి అక్షరానా కనిపిస్తున్నది. “పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి” అనే మహాత్మా గాంధీ మాటలను గుర్తుచేసుకుంటూ, ప్రతి బిడ్డ చదువే తెలంగాణ ప్రగతి అనే ధ్యేయంతో సాగుతున్న ఈ ప్రభుత్వ విధానాలు ఎంతో ప్రశంసనీయం. ఈ బడ్జెట్ అందరికీ సమాన అవకాశాలు కల్పించి, తెలంగాణ బిడ్డలను విశ్వ వేదికపై విజేతలుగా నిలబెడుతుంది అనే నమ్మకం బలంగా కనిపిస్తున్నది. విద్యావంతుడైన పౌరుడే దేశానికి అసలైన ఆస్తి అని నమ్ముతున్న ఈ ప్రభుత్వం, ఆ దిశగా వేసిన ప్రతి అడుగు పటిష్టమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. ఈ విద్యా విప్లవం రేపటి తెలంగాణను ప్రపంచ పటంలో ఒక వెలుగు దివ్వెలా నిలబెడుతుందనడంలో సందేహం లేదు.
- పురుషోత్తం నారగౌని
సీనియర్ జర్నలిస్ట్,
సామాజిక విశ్లేషకులు.