మంత్రి కొండా సురేఖను కలిసిన నూతన పీసీసీఎఫ్ వినయ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్ర అటవీదళాల నూతన ప్రధాన సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కుమార్, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖను జూబ్లిహిల్స్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, అటవీ సంపదను కాపాడటంలో తీసుకోవాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ లక్ష్యాల అమలుపై సమగ్ర చర్చ: రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంపు, జీవ వైవిధ్య సంరక్షణ, వన మహోత్సవం వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రి సురేఖ, నూతన పీసీసీఎఫ్ వినయ్ కుమార్ చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, సాంకేతికతను వినియోగించుకుంటూ అటవీ రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. భవిష్యత్ తరాలకు పచ్చని అడవులను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
సిబ్బందికి ప్రోత్సాహం.. మైలురాయిగా అవార్డులు: అటవీ అధికారులకు, సిబ్బందికి ప్రతి ఏటా అవార్డులు మరియు నగదు ప్రోత్సాహకాలు అందించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పీసీసీఎఫ్ వినయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సురేఖ చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమం, అటవీ సిబ్బందికి ప్రభుత్వం ఇస్తున్న గొప్ప గౌరవమని, ఇది తెలంగాణ అటవీ రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అటవీ శాఖ పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

మాజీ పీసీసీఎఫ్ సువర్ణకు ఘన సన్మానం: ఈ సందర్భంగా, పదవీ విరమణ చేసిన మాజీ పీసీసీఎఫ్ శ్రీమతి సువర్ణ, మంత్రి సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. అటవీ శాఖకు సువర్ణ అందించిన విశిష్ట సేవలను కొనియాడిన మంత్రి సురేఖ, ఆమెను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఆమె జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
