హైదరాబాద్: ప్రతి పేద కుటుంబానికి శాశ్వత నివాసాన్ని కల్పించి, వారి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, స్థానిక శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీద్ హుస్సేన్‌లతో కలిసి ఆయన లబ్ధిదారులకు గృహాల పట్టాలు, తాళాలు అందజేశారు.
ఉపాధికి దూరం కాకుండా.. ఇంటికి దగ్గరగా ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “నగరంలో ఉపాధి పొందుతున్న పేదలు తమ పని ప్రాంతాలకు దూరంగా వెళ్లకుండా, అదే పరిసరాల్లో ఇళ్లు నిర్మించి అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇందుకోసం విలువైన ప్రభుత్వ భూములను వినియోగిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నగరంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా కార్యాచరణ మొదలైంది” అని తెలిపారు. గత పదేళ్లుగా గృహాల కోసం ఎదురుచూసిన వారికి ఈ రోజు పట్టాలు అందించడం చారిత్రక సందర్భమని పేర్కొంటూ, జాప్యం పట్ల విచారం వ్యక్తం చేశారు.
నివాసయోగ్యం కాని భవనాలపై సర్వే హైదరాబాద్‌లోని పాత వాంబే, జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలాను మంత్రి ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి, మరమ్మతు చేయదగిన వాటిని పునరుద్ధరించి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇకపై అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రేషన్ కార్డులు జారీ చేసే విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
సామాజిక న్యాయానికి ప్రతీక మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, పేదలకు శాశ్వత గృహం కల్పించడం సామాజిక న్యాయానికి నిదర్శనమని, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో మొత్తం 361 గృహాలను లబ్ధిదారులకు కేటాయించారు. ఇందులో చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి 187, నాంపల్లికి 79, నాచారం కాలనీకి 95 గృహాలను అందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా వివరించారు.
ఈ కార్యక్రమంలో మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ నగేష్, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు.

