జిల్లా కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, జూలై 4: రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యం, తాగునీరు, విద్యా రంగాల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణతో పాటు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, రైతులు ఇబ్బంది పడకుండా జిల్లాకు తగినట్లుగా ‘కంటింజెన్సీ క్రాపింగ్ ప్లాన్స్’ (ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు) సిద్ధం చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఎటువంటి లోటు లేకుండా చూడాలని, పంటల మార్పిడి (క్రాప్ డైవర్సిఫికేషన్)పై రైతులను చైతన్యపరచాలని ఆయన సూచించారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు వేయడం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందని, నష్టభయం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమన్వయం రుతుపవనాల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య, పంచాయతీ రాజ్, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. ముందస్తు నివారణ చర్యలు, పారిశుధ్య పనులు, దోమల నియంత్రణ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటేనే వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన చెప్పారు.
తాగునీరు, విద్య, విద్యుత్‌పై సమీక్ష
- తాగునీరు: వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడటం అత్యంత ప్రాధాన్యత అంశమని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
- విద్య: మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన కిచెన్ షెడ్ల నిర్మాణానికి స్థలాలను వెంటనే గుర్తించి, పనులను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
- విద్యుత్: వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో విద్యుత్ సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.
ప్రాధాన్యత కలిగిన అన్ని అంశాలపై క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని, ఉన్నతాధికారులు నిరంతరం మానిటరింగ్ చేయాలని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దాన కిషోర్, నవీన్ మిట్టల్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు, వివిధ శాఖల కార్యదర్శులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








