ధృతరాష్ట్రుడి పాత్రలో చైర్మన్!
కలం యోధులపై కత్తుల వేటు – 4
జర్నలిజం గురువుకు, జర్నలిస్టు నాయకులకు
కమీషనరేట్లో ఘోర అవమానం.. ఎక్కడిది ఈ అలిఖిత రాజ్యాంగం?
గురువుకే పరాభవం: జర్నలిజంలో పీజీ చేసి, నగరంలోని ఎన్నో జర్నలిజం స్కూళ్లలో కాలేజీలలో వందలాది మందికి పాఠాలు నేర్పిన గురువును “నువ్వు ఊరి వాడివి హైదరాబాద్ వాడివి కాదు ” అని కార్డు ఇవ్వకపోవడం
నాయకుడికే అవమానం : అన్ని అర్హతలతో దరఖాస్తు చేసుకున్న మరో ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని అవమానిస్తూ, నిండు సభలో బ్యూరో చీఫ్‌కు ఫోన్ చేసి కక్షసాధింపుకు దిగడం.
ధృతరాష్ట్ర చైర్మన్ మౌనం: ఈ ఇద్దరు జర్నలిస్టు మిత్రులకు కళ్లముందే అన్యాయం జరుగుతుంటే.. ఆ కమిటీ చైర్మన్ ధృతరాష్ట్రుడిలా మౌనంగా ఎందుకు కూర్చున్నారు?
కంట్రిబ్యూటర్ల ఆగ్రహం: కమీషనరేట్లో కూర్చుని చక్రం తిప్పుతున్నఈ సోకాల్డ్ పెద్ద నాయకులు కూడా ఒకప్పుడు కంట్రిబ్యూటర్లుగా పనిచేసినవారే.. యావత్ కంట్రిబ్యూటర్ లోకం దీనిపై తిరగబడక తప్పదు!
నిండు సభలో జర్నలిస్టులకు అవమానం.. దేనికి సంకేతం?
తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) కమీషనరేట్ వేదికగా అక్రిడిటేషన్ కమిటీల నిర్వహణ సాగుతున్న తీరు చూస్తుంటే.. యావత్ పాత్రికేయ లోకం తలదించుకోవాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలో రక్తం చెమటా చిందించే వర్కింగ్ జర్నలిస్టుల హక్కులను కాపాడాల్సిన కమిటీ పీఠాలు, ఇవాళ కొందరు ముఠా నాయకుల కక్షసాధింపు కేంద్రాలుగా మారిపోయాయి. మొన్నటికి మొన్న ఆ నిండు సభలో అర్హులైన జర్నలిస్టుల అప్లికేషన్లను త్రోసిరాజని వారి దరఖాస్తును రెజెక్ట్ చేసిన ఈ రెండు ఘోరమైన పరాభవాలు.. సాక్షాత్తూ “ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని” తలపించాయి. ఈ కుట్రలు యావత్ రాష్ట్రంలోని వేలాది మంది కంట్రిబ్యూటర్ల ఉనికిని, ఆత్మగౌరవాన్ని నిలువునా కుదిపేస్తున్నాయి.
మొదటి ఘోరం: తోటి నాయకుడిపైనే కక్షసాధింపు.. బ్యూరో చీఫ్‌కే ఫోన్ చేస్తారా?
ఆ నిండు సభలో జరిగిన మొదటి ఘోరం చూస్తే ఈ ముఠా అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఒక తోటి జర్నలిస్ట్ మిత్రుడు, మరో ప్రధాన జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్.. నిబంధనల ప్రకారం ఫ్రీలాన్స్ అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దానికి ఐ&పీఆర్ రూల్స్ ప్రకారం కావలసిన 5 ఏళ్ల అక్రిడిటేషన్ అనుభవం, 15 బైలైన్ ఆర్టికల్స్ లాంటి అన్ని పక్కా ఆధారాలను, రికార్డులను ఆయన సబ్మిట్ చేశారు.
కానీ, కమిటీలో కూర్చున్న సదరు ముఠా నాయకుడు కక్షసాధింపు ధోరణితో.. “ఆయన ఒక పత్రికలో కంట్రిబ్యూటర్ మాత్రమే.. ఫ్రీలాన్సర్‌గా అర్హత లేదు, కావాలంటే ఇప్పుడే నిరూపిస్తా” అంటూ నిండు సభలో అడ్డగోలుగా వాదించాడు. అంతటితో ఆగకుండా, తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ అందరి ముందూ అప్పటికప్పుడు సదరు పత్రిక బ్యూరో చీఫ్‌కు ఫోన్ చేసి, “ఆయన మీ దగ్గర కంట్రిబ్యూటర్‌గా చేస్తున్నాడా లేదా?” అని ఇన్క్వైరీ చేస్తూ నానా రభస చేశాడు. అన్ని నిబంధనలు నెరవేర్చిన ఒక తోటి జర్నలిస్ట్ నాయకుడిని ఇలా నిండు సభలో అవమానించడం పాత్రికేయ పరాభవం కాదా? మరి 770 ఫ్రీలాన్స్ కార్డులు మంజూరు చేసిన నాయకా మరి అందరి అప్లికేషన్లను ఇలాగే నిల దీయలేదేమి? నువ్వు అనుకుంటే ఏమి లేకున్నా కార్డులు మంజూరు చేస్తావు. నువ్వు వద్దనుకుంటే ఏది ఉన్నా కార్డులు ఇవ్వవు. ఇదెక్కడి నీతి ? ఈ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి .
రెండవ ఘోరం: జర్నలిజం గురువుకే తిరస్కారమా? ఎక్కడిది ఈ అలిఖిత రాజ్యాంగం?
అదే సభలో సాగిన రెండవ అరాచకం యావత్ పాత్రికేయ ప్రగతికే ఒక గొడ్డలిపెట్టు. సమాజంలో నాలుగు దశాబ్దాలుగా నిఖార్సయిన జర్నలిజం చేస్తూ, గత 20 ఏళ్లుగా అక్రిడిటేషన్ కార్డు కలిగి ఉన్న ఒక సీనియర్ జర్నలిస్టు అప్లికేషన్‌ను ఈ ముఠా అత్యంత దారుణంగా అడ్డుకుంది. ఈయన ఎవరో తెలుసా? జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) చేసిన మేధావి, నగరంలోని ప్రముఖ జర్నలిజం స్కూళ్లలో ఎంతోమందికి పాత్రికేయ పాఠాలు నేర్పిన విద్యా గురువు! ఇవాళ కమీషనరేట్లో, డెస్క్‌లలో కూర్చుని రూల్స్ మాట్లాడుతున్న ఎంతోమంది ఈయన శిష్యులే!
అలాంటి ఒక విద్యావంతుడిని, గురువును పట్టుకుని.. “నీది యాదాద్రి భువనగిరి జిల్లా.. నువ్వు జిల్లా వాడివి కాబట్టి నీకు ఇక్కడ కమీషనరేట్లో స్టేట్ కార్డు ఇవ్వడం కుదరదు” అంటూ నిలిపివేశారు. ఇంతకంటే ఘోరమైన అహంకారం ఎక్కడైనా ఉంటుందా? ఒక జర్నలిస్టుకు ఇన్ని విద్యార్హతలు, నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్నా.. కేవలం “ఊరి వాడు” కావడమే ఆయన చేసిన తప్పా? అసలు సమాచార శాఖలో ఏ జీవోలో ఉంది ఈ తుగ్లక్ నిబంధనలు ? ఈ అలిఖిత రాజ్యాంగం ఎక్కడి నుండి వచ్చింది? మరి ఈ రెండు ఘోరాలు కళ్లముందే జరుగుతుంటే.. అక్కడ కుర్చీలో కూర్చున్న “ధృతరాష్ట్ర చైర్మన్” కళ్లు మూసుకుని ఏం చేస్తున్నట్టు? ఎందుకు మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయారు? ఇవి మన దృష్టికి వచ్చిన దృష్టాంతాలలో కొన్ని మాత్రమే. ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళ కథలు చాలా ఉన్నాయి.
పెద్ద నాయకుల చిన్న బుద్ధులు.. కంట్రిబ్యూటర్ల మహా అస్త్రం సిద్ధం!
ఇక్కడ ఇంకొక చేదు నిజం ఏంటంటే.. ఇవాళ కమీషనరేట్ బిల్డింగ్‌లో పెద్ద పీఠాలపై కూర్చుని, రూల్స్ మాట్లాడుతున్న ఈ పెద్ద జర్నలిస్ట్ నాయకులు కూడా ఒకప్పుడు క్షేత్రస్థాయిలో కంట్రిబ్యూటర్లుగా, సామాన్య రిపోర్టర్లుగా కెరీర్ ప్రారంభించినవారే! కింది స్థాయి నుండి పైకొచ్చిన ఈ నాయకులకు, క్షేత్రస్థాయిలో కంట్రిబ్యూటర్లు పడే బాధలు తెలియాలి కదా? కానీ, కుర్చీలు ఎక్కగానే పాత రోజులు మరిచిపోయి, అహంకారంతో చిన్న బుద్ధులు చూపిస్తూ, నిఖార్సయిన కలం యోధుల అప్లికేషన్లతో దొంగాటలు ఆడుతున్నారు.
ఈ రెండు సంఘటనలు యావత్ రాష్ట్రంలోని కంట్రిబ్యూటర్ల కళ్లను తెరిపించాయి. ఇవాళ ఒక ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శికి, జర్నలిజం పీజీ చదివిన ఒక విద్యా గురువుకే కమీషనరేట్లో ఈ స్థాయిలో అవమానం జరిగితే.. ఇక జిల్లాల్లో, మండలాల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే సామాన్య కంట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి? అన్నీ జిల్లాలలో అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా ఉన్న వీళ్ళ ముఠా నాయకులు వీళ్ళ దారిలోనే నడుస్తూ ఎంతోమంది గ్రామీణ జర్నలిస్టుల ఊసురు పోసుకుంటున్నారు . అందుకే, ఈ ముఠా అరాచకాలపై యావత్ కంట్రిబ్యూటర్ లోకం ఏకమైతున్నది.
ముఖ్యమంత్రి గారు, సమాచార శాఖ మంత్రి గారు జర్నలిస్టుల పట్ల ఎంతో ఉదారతతో ఉన్నారు. “నిబంధనలు సడలించి అయినా కార్డులు ఇవ్వండి” అని వారు చెబుతుంటే, ఈ దళారీ ముఠా మాత్రం కమిటీల్లో కూర్చుని సొంత కక్షలు తీర్చుకుంటోంది.
కానీ ఈ నాయకులు ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి.. పాలకుల మోహమాటాన్ని అడ్డుపెట్టుకుని మీరు ఆడుతున్న ఈ అవమానకర నాటకాలు ఎంతో కాలం సాగవు. ఏ రోజు అయితే పాలకులకు మీ దళారీ కుట్రలు, ఈ అడ్డగోలు కక్షసాధింపుల నాటకాలు సంపూర్ణంగా అర్థమవుతాయో.. ఆ మరుసటి తెల్లవారే మీ దొంగ బ్రతుకులు నిలువునా తెల్లారడం ఖాయం!
- పురుషోత్తం నారగౌని
సీనియర్ జర్నలిస్ట్ & రాష్ట్ర అధ్యక్షుడు, TSJU
