కలం యోధులపై కత్తుల వేటు 2
పెద్ద కుర్చీల్లో కూర్చుని చిన్న బుద్ధులు చూపిస్తున్న పెద్ద మనషుల ఆటలు బట్టబయలు!
- క్షేత్రస్థాయిలో ప్రాణాలు పణంగా పెట్టే రిపోర్టర్లకు వంద నిబంధనలు పెట్టారు సరే.. మరి జర్నలిస్టుల అర్హతలను నిర్ణయించే ఆ కమిటీ పెద్దల అర్హతలేమిటి?
- నిజమైన జర్నలిస్టులను ప్రశ్నించే అదే కమిటీల్లో, ఎలాంటి జర్నలిస్టిక్ నైపుణ్యాలూ లేని శక్తులు దర్జాగా కూర్చోవడం పాత్రికేయ లోకపు దౌర్భాగ్యం!
- ఎన్నైనా కార్డులు ఇవ్వండన్న ముఖ్యమంత్రి, మంత్రి గారి మంచి తనాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద మనుషులు దందాకు తెరతీశారు.
- కమిటీలో కొందరు మంచివారూ ఉన్నారు.. కానీ ఆధిపత్య ముఠా దర్పం ముందు వారి గొంతులు నొక్కబడుతున్నాయి!
అర్హతల అపహాస్యం..
తెలంగాణ సమాచార శాఖ (I&PR) లోపల అక్రిడిటేషన్ల ప్రక్రియ నడుస్తున్న తీరు చూస్తుంటే యావత్ పాత్రికేయ లోకం తలదించుకోవాల్సి వస్తోంది. ఇక్కడ సామాన్య వర్కింగ్ జర్నలిస్టులు అడుగుతున్న ఒకే ఒక్క సూటి ప్రశ్న.. “క్షేత్రస్థాయిలో రక్తం చెమటా చిందించే పేషెంట్ల లాంటి జర్నలిస్టులకు వంద రకాల అర్హతలు అడిగారు సరే.. మరి వారికి చికిత్స చేయడానికంటూ పెద్ద పీఠాలపై కూర్చున్న ఆ డాక్టర్ల లాంటి కమిటీ సభ్యుల అర్హతలేమిటి?”
ఈ ప్రశ్న వెనుక ఉన్న చేదు నిజం ఏంటంటే.. నిత్యం ఫీల్డ్‌లో కష్టపడే నిజమైన జర్నలిస్టుల అర్హతలను వేలెత్తి చూపి, వారి కార్డులను రిజెక్ట్ చేసే ఆ కమిటీలలోనే.. అసలు ఎలాంటి జర్నలిస్టిక్ అర్హతలూ లేని శక్తులు దర్జాగా కూర్చుని వ్యవస్థను శాసించడం యావత్ పాత్రికేయ రంగానికే ఒక పెద్ద దౌర్భాగ్యం!
కమిటీలలో యూనియన్ల పేరిట స్టేట్ కమిటీ మొదలుకుని అన్నీ జిల్లా అక్రిడేషన్ల కమిటీలలో దొడ్డిదారిన కుర్చీలు సంపాదించుకున్న సదరు సంఘం నాయకులలో కొందరికి క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌తో గానీ, నిత్యం డెస్క్‌లపై వార్తలు రాసే వృత్తి నైపుణ్యంతో గానీ నేరుగా ఎలాంటి ప్రమేయం లేదు. అలాంటి వ్యక్తులు పెద్ద పెద్ద పీఠాలపై దర్జాగా కూర్చుని, దశాబ్దాలుగా ఎండనక వాననక వార్తల కోసం తిరిగే జెన్యూన్ జర్నలిస్టుల అర్హతలను ప్రశ్నించడం కంటే ప్రజాస్వామ్య పరాభవం మరొకటి ఉంటుందా?
ప్రభుత్వ పెద్దలు సమాజంలో పేరున్న పెద్ద మనుషులు ఈ కుర్చీలలో కూర్చుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధంగానే వ్యవహరిస్తారని నమ్మి వారికి బాధ్యతలు అప్పగించారు. అందుకనే బహుశా వారికి విడిగా కఠినమైన నిబంధనలేవీ ప్రత్యేకంగా చెప్పలేదు! కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ సదరు నాయకులు మాత్రం అత్యంత చిన్న మనస్తత్వంతో ప్రవర్తిస్తూ తమ అసలు నైజాన్ని బయటపెట్టుకుంటున్నారు.
📌 ప్రభుత్వ ఉదారతను ముంచుతున్న ‘పెద్ద మనుషుల ’ నాటకాలు!
ప్రస్తుత ముఖ్యమంత్రి , సమాచార శాఖ మంత్రి జర్నలిస్టుల పట్ల ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏ ఒక్క వర్కింగ్ జర్నలిస్టుకు అన్యాయం జరగకూడదని, అవసరమైతే నిబంధనలు సడలించి అయినా సరే ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ వీరి మీది నమ్మకంతో కనీసం వీరివైపు కన్నెత్తి కూడా చూడ లేదు. ప్రభుత్వానికి జర్నలిస్టులపై ఉన్న ఈ అమూల్యమైన ప్రేమను, ఈ రాజకీయ మోహమాటాన్ని ఆసరాగా చేసుకుని ఈ దళారీ సంఘం కొత్త నాటకానికి తెరతీసింది.
ప్రభుత్వం ఎంత ఉదారంగా కార్డులు ఇవ్వాలని చూస్తుంటే.. ఈ ముఠా మాత్రం వాటిని తమ సొంత దందాలకు వాడుకుంటోంది. జర్నలిస్టుల సంక్షేమాన్ని కాపాడాల్సిన ఈ ఆధిపత్య సంఘంలోని కొందరు గుంట నక్కల్లా మారి, అర్హులైన జర్నలిస్టుల పొట్టకొడుతూ, అనర్హులకు కార్డులను కట్టబెడుతూ నోట్ల దందాకు తెరతీశారు. యాజమాన్యాలు జర్నలిస్టులకు సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడాన్ని కనీసం ఒక్కసారైనా ప్రశ్నించని ఈ సంఘం ఈ కార్డును ఒక అధికారిక లైసెన్స్ లాగా మార్చేసి, బ్రోకర్లకు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా నిఖార్సయిన జర్నలిజం చేసే వర్కింగ్ జర్నలిస్టుల గొంతు కోస్తూ, సమాచార శాఖ ప్రతిష్టను, ప్రభుత్వ క్లీన్ ఇమేజ్ను నిలువునా బద్నాం చేస్తున్నారు.
ఈ అలిఖిత నిబంధనలపై, బాధ్యతారాహిత్యాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. కమిటీలో ఉన్న సభ్యులందరూ తప్పుడు వారు కారు. అందులో కొంతమంది నిజంగా నిజాయితీపరులు, మంచివారు కూడా ఉన్నారు. కానీ ముఠా నాయకుల అండదండల ముందు ఈ మంచివారి గొంతులు మినిట్స్ బుక్‌లో రికార్డు కావడం లేదు. నిర్ణయాలలో కమిటీది ‘సమష్టి బాధ్యత’ కాబట్టి, రేపు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే కమిటీలోని ప్రతి సభ్యుడూ వ్యక్తిగతంగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకే మంచివారైన సభ్యులు ఇప్పటికైనా మేల్కొని, తమ నిరసనను అధికారికంగా రికార్డు చేయించాలి.
ఈ ముఠా నాయకులు ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రభుత్వ పెద్దలు మీపై ఉన్న మోహమాటంతో సైలెంట్‌గా ఉంటున్నంత వరకే మీ ఆటలు సాగుతాయి. ఏ రోజు అయితే పాలకులకు మీ దళారీ కుట్రలు, ఈ అడ్డగోలు అర్హతల నాటకాలు, కమిటీల్లో అర్హత లేని వారు దర్జాగా చెలామణి అవుతున్న దౌర్భాగ్య నిజాలు సంపూర్ణంగా అర్థమవుతాయో.. ఆ మరుసటి తెల్లవారే మీ దొంగ బ్రతుకులు నిలువునా తెల్లారడం ఖాయం!
- పురుషోత్తం నారగౌని
సీనియర్ జర్నలిస్ట్ & రాష్ట్ర అధ్యక్షుడు, TSJU
(రేపటి కథనంలో: చీకటి వెబ్సైట్.. రాజకోట రహస్యాలు! అక్రిడిటేషన్ల జాబితాను ఐ&పీఆర్ ఎందుకు దాస్తోంది?)
