మంత్రి పొంగులేటి దిశానిర్దేశం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలో క్యూర్ (QURE) పరిధిలో అఫర్డబుల్ ఎల్ఐజి అర్బన్ హౌసింగ్ స్కీమ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణంపై ఆయన సమీక్ష నిర్వహించారు.
పేదల సొంతింటి కల సాకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో పట్టణాల్లోనూ పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని మంత్రి పేర్కొన్నారు. “క్యూర్ పరిధిలో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని, పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి స్థలాల గుర్తింపు, పొజిషన్ తీసుకోవడం వంటి పనులను వేగవంతం చేయాలి” అని ఆయన సూచించారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో తొలి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లు నిర్మిస్తామని, టెండర్లను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు.
ఆధునిక భవనాల నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటిలో పది ఆర్డీవో, 107 తహశీల్దార్, రెండు డిఐజి, నాలుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్, 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనాలన్నీ ఒకే నమూనాలో, ఆధునిక సదుపాయాలతో ఉంటాయని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సోలార్ పార్కింగ్ వంటి పర్యావరణహిత చర్యలు చేపడతామని మంత్రి వివరించారు.
ఈ సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
