స్మార్ట్ ఫోన్ లోకంలో బందీ అయిన యువత.. వివేకానందుడి సింహగర్జన వినపడటం లేదా?

(స్వామి వివేకానంద జయంతి సందర్భంగా )

“లేవండి! మేల్కొనండి!! గమ్యం చేరేవరకూ విశ్రమించకండి!!!” ఈ మాటలు వినిపించగానే మన నరాల్లో తెలియని ఒక విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. అలసత్వం ఆమడ దూరం పారిపోతుంది. ఇది కేవలం ఒక నినాదం కాదు.. శతాబ్దం క్రితం ఒక యువ సన్యాసి, భరతజాతి యువత గుండెల్లో రగిలించిన దావానలం. ఆ యువ సన్యాసి స్వామి వివేకానందుడు. నేడు జనవరి 12, ఆయన జయంతి. దేశమంతా ఘనంగా జరుపుకుంటుంది. విగ్రహాలకు పూలమాలలు వేస్తాం, సోషల్ మీడియాలో ఆయన కోట్స్ స్టేటస్‌లుగా పెడతాం. కానీ ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని నిజాయితీగా ప్రశ్నించుకుందాం.. ఆయన కోరుకున్న యువత మనమేనా? ఆయన కలలు కన్న “ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం” కలిగిన యువతరం నేడు ఉందా?

రీల్స్ మోజులో.. రియాలిటీ మిస్సింగ్! వివేకానందుడు యువతను ఉద్దేశించి “మీరు సింహాలు, గొర్రెల్లా బ్రతకడం మానేయండి” అని పిలుపునిచ్చారు. కానీ నేడు మన యువత సింహాల్లా గర్జిస్తోందా? లేక స్మార్ట్ ఫోన్ స్క్రీన్ల వెనుక తలలు వంచి, గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ కాలం గడుపుతోందా? అనేది చేదు నిజం. ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాలనే కసి యువత కళ్ళలో కనిపించేది. ఇప్పుడు ఆ కళ్ళలో కేవలం బ్లూ లైట్ వెలుతురు, నిద్రలేమి, నిర్వేదం మాత్రమే కనిపిస్తున్నాయి. “ఏకాగ్రతే విద్యకు సారం” (Concentration is the essence of education) అని వివేకానందుడు చెప్పారు. కానీ నేటి యువత ఏకాగ్రత నిడివి (Attention Span) కేవలం 15 సెకన్లకు పడిపోయింది. ఒక రీల్ నుంచి మరో రీల్ కు మారినంత వేగంగా మనసు మారిపోతోంది. గంటల తరబడి పుస్తకం చదివే ఓపిక నశించింది. లోతైన ఆలోచన (Deep Thinking) మాయమైపోయింది. వివేకానందుడు కోరుకున్నది మెదడుకు పదును పెట్టే యువతను.. కానీ మనం తయారైంది “లైక్ ల కోసం, వ్యూస్ కోసం” వెంపర్లాడే యువతగా. ఇది వివేకానందుడికి మనం ఇస్తున్న నివాళా?

బలమే జీవనం.. బలహీనతే మరణం: స్వామి వివేకానందుడి బోధనల్లో అత్యంత కీలకమైనది “ధైర్యం”. “నీవు దేనిని ఆలోచిస్తావో అదే అవుతావు. బలవంతుడివని భావిస్తే బలవంతుడివి అవుతావు” అని ఆయన చెప్పారు. కానీ నేటి పరిస్థితి ఏమిటి? చిన్న చిన్న వైఫల్యాలకే కుంగిపోవడం, పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని, ప్రేమ విఫలమైందని, ఉద్యోగం రాలేదని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం.. ఇదా యువత లక్షణం? దేశాన్ని నడిపించాల్సిన యువత, తమ జీవితాన్నే నడిపించుకోలేక డిప్రెషన్ (Depression) బారిన పడటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. శారీరక బలం, మానసిక స్థైర్యం రెండూ సన్నగిల్లిపోతున్నాయి. జిమ్ లో కండలు పెంచుతున్నారేమో కానీ, గుండె ధైర్యాన్ని పెంచుకోవడం లేదు. సమస్య ఎదురవగానే పారిపోతున్నారు. వివేకానందుడు చెప్పినట్లు.. “ధైర్యంగా నిలబడు, బాధ్యతను స్వీకరించు”. నీ ఓటమికి, నీ గెలుపుకి నువ్వే బాధ్యుడివి. పక్కవారిని నిందించడం పిరికివాడి లక్షణం.

ఒక లక్ష్యం.. వంద ఆలోచనలు: “ఒక భావనను తీసుకోండి. దాన్నే మీ జీవితంగా మార్చుకోండి. దాని గురించే ఆలోచించండి, దాని గురించే కలలు కనండి. మీ నరనరాల్లో ఆ భావన నిండిపోవాలి” – ఇది విజయం గురించి వివేకానందుడు చెప్పిన సూత్రం. కానీ నేటి యువతలో “లక్ష్యం” (Goal) పట్ల స్పష్టత ఉందా? బహుళ ఆసక్తుల (Multitasking) పేరుతో ఏ ఒక్క పనిలోనూ నైపుణ్యం లేకుండా తయారవుతున్నారు. గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూడటంలోనే సగం సమయం వృధా అవుతోంది. పక్కవాడి సక్సెస్ చూసి ఈర్ష్య పడటం లేదా తాత్కాలికంగా ఇన్స్పైర్ అవ్వడం తప్ప, “నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి, దాని కోసం నేను నిరంతరం శ్రమించాలి” అనే తపన ఎంతమందిలో ఉంది? ఫోకస్ లేని యువత, చుక్కాని లేని నావ లాంటిది. అది ఎప్పటికీ గమ్యం చేరదు.

దేశం అంటే మట్టి కాదు.. మనుషులు: వివేకానందుడు కేవలం ఆధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు, గొప్ప దేశభక్తుడు. “నా దేశంలోని కుక్క ఆకలితో అలమటించినా, దానికి ఆహారం దొరకడమే నా మతం” అని ప్రకటించిన మహా మానవతావాది. కానీ నేడు “దేశం నాకేమిచ్చింది?” అని ప్రశ్నించే వారే తప్ప, “దేశానికి నేనేమిచ్చాను?” అని ఆలోచించే వారు కరువయ్యారు. మేధో వలసలు (Brain Drain) పెరిగిపోతున్నాయి. ఇక్కడ చదువుకుని, ఇక్కడ వనరులు వాడుకుని, విదేశాలకు వెళ్లిపోవడాన్నే గొప్ప విజయంగా భావిస్తున్నారు. తప్పు లేదు, వెళ్ళండి.. సంపాదించండి. కానీ కనీసం మీ సంపాదనలో కొంతైనా, మీ సమయానో కొంతైనా ఈ మాతృభూమి రుణం తీర్చుకోవడానికి కేటాయిస్తున్నారా? స్వార్థం పెరిగిపోతున్న సమాజంలో, వివేకానందుడి “సేవా భావం” మరుగున పడిపోతోంది. పక్కవాడికి సహాయం చేయడం అనేది ఒక బాధ్యతగా కాక, ఒక పనికిరాని పనిగా భావించే రోజులు వచ్చేశాయి.

మతం కాదు.. మానవత్వం: నేడు యువతను పట్టి పీడిస్తున్న మరో జాడ్యం.. మత మౌఢ్యం, కుల పిచ్చి. వివేకానందుడు చికాగో వేదికపై “సోదర సోదరీమణులారా” అని పిలిచి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటారు. “మానవ సేవే మాధవ సేవ” అని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో విషం చిమ్మే యువతను చూస్తుంటే, ఆయన ఆశయాలకు మనం తూట్లు పొడుస్తున్నామేమో అనిపిస్తుంది. మతం అనేది మనిషిని సంస్కరించాలే తప్ప, ఉన్మాదిగా మార్చకూడదు. యువత శక్తిని నిర్మాణాత్మక పనులకు వాడాలి కానీ, విద్వేషాలను రగిల్చడానికి కాదు.

ఇప్పటికైనా మేల్కొందాం.. మిత్రులారా! వివేకానందుడు మనల్ని చూసి గర్వపడాలంటే మనం ఏం చేయాలి? ముందు ఆ స్మార్ట్ ఫోన్ మత్తు నుంచి బయటకు రావాలి. వాస్తవ ప్రపంచంలో బ్రతకాలి. శరీరాన్ని, మనస్సును దృఢంగా మార్చుకోవాలి. ఏదో ఒక నైపుణ్యాన్ని (Skill) నేర్చుకోవాలి. నిరంతర విద్యార్థిగా ఉండాలి. అపజయాలకు కుంగిపోకుండా, వాటిని విజయానికి మెట్లుగా మార్చుకోవాలి. “సాధ్యం కాదు” అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేయాలి. ఎందుకంటే, “అనంతమైన శక్తి నీలోనే ఉంది” అని గురువు గారు చెప్పారు. ఆ శక్తిని గుర్తించు.

వివేకానంద జయంతి అంటే వాట్సాప్ స్టేటస్ లు పెట్టడం కాదు.. మన స్టేటస్ (స్థాయి) పెంచుకోవడం. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. నీవు మారితే, నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారితే గ్రామం, గ్రామం మారితే దేశం మారుతుంది. భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా మారాలంటే అది కేవలం యువత చేతిలోనే ఉంది.

ఆనాడు వివేకానందుడు “నాకు వంద మంది శక్తివంతమైన యువకులను ఇవ్వండి, నేను ప్రపంచాన్ని మారుస్తాను” అని అడిగారు. ఆ వంద మందిలో నువ్వు ఉంటావా? లేదా ఆయన ఆశలను వమ్ము చేసే గుంపులో ఉంటావా? నిర్ణయం నీదే.

“లే! మేల్కొను!! గమ్యం చేరేదాకా ఆగిపోకు!!!”

– పురుషోత్తం నారగౌని

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *