కత్తి ఇచ్చారు.. క్రాఫ్ట్ మరిచారు!
గుత్తాధిపత్య ముఠా కుట్రలపై ప్రత్యేక విశ్లేషణ – భాగం-1
కమిటీ ప్రతి సభ్యుడికీ బాధ్యత మాత్రమే కాదు జవాబుదారీ కూడా!
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పాత్రికేయ లోకంపై పూర్తి ఉదారత, సానుకూలత ఉన్న మాట అక్షరాలా వాస్తవం. గత పాలకుల కంటే ఎక్కువ మంది వర్కింగ్ జర్నలిస్టులకు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, పాలకుల ఈ మంచి తనాన్ని, మోహమాటాన్ని ఆసరాగా చేసుకుని ఒక గుత్తాధిపత్య యూనియన్ ముఠా తెరవెనుక చెలరేగిపోతోంది. రాజ్యాంగ నిబంధనలను, సహజ న్యాయ సూత్రాలను నిలువునా ఉల్లంఘిస్తూ.. అర్హులైన జర్నలిస్టులపై కత్తులు ఝలిపిస్తూ, అనర్హులకు పూల విత్తులు చల్లుతున్న సదరు సంఘం అరాచకాలపై ప్రత్యేక పోస్ట్‌మార్టమ్
- 📌 హైలైట్స్:
- అడ్డగోలు అంకగణితం: కేవలం ఉదాహరణే ఫ్రీలాన్స్ కార్డులు.. ఐ&పీఆర్ నిబంధనల ప్రకారం లెక్కిస్తే బయటపడ్డ శతాబ్దపు అతిపెద్ద బోగస్ 770 కార్డుల నెట్వర్క్ దందా.
- చట్టబద్ధ సూచన : కమిటీ నిర్ణయాలలో సమష్టి బాధ్యత ఉంటుంది కాబట్టి, ప్రతి సభ్యుడి వర్షన్ (అంగీకారం లేదా వ్యతిరేకత) మినిట్స్‌లో రికార్డు కావాల్సిందే.. లేదంటే కోర్టుల చుట్టూ తిరగక తప్పదు !
- తాళంచెవి దొంగల హస్తగతం: ప్రభుత్వ ఉదారతను అడ్డం పెట్టుకుని, కార్డులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ నిజమైన పాత్రికేయుల గొంతు కోస్తున్న శక్తులపై తక్షణ విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తే ఈ దొంగ సంఘం భాగోతం బట్ట బయలు
- రాష్ట్రవ్యాప్త కుంభకోణం: ఈ దొంగ దందా కేవలం స్టేట్ కమిటీకే పరిమితం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అక్రిడిటేషన్ కమిటీలలోనూ ఇదే తరహా తంతు, ఇదే ఇష్టారాజ్యం సాగుతోంది!
అధికార దర్పం.. బాధ్యతారహిత్య పీఠాలు!
ప్రభుత్వం అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు పెద్ద కుర్చీలు కట్టబెట్టింది కానీ.. ఆ పదవులతో పాటు సమానంగా ఉండే బాధ్యతలు ఏమిటో స్పష్టం చేయలేదు. అసలు ప్రభుత్వ పెద్దలు ఏమనుకున్నారంటే.. సమాజంలో ఎంతో అనుభవం, గౌరవం ఉన్న పెద్ద మనుషులు ఆ పెద్ద కుర్చీలలో కూర్చుంటున్నారు కాబట్టి, వారు ఖచ్చితంగా న్యాయమే చేస్తారని, చట్టబద్ధంగానే వ్యవహరిస్తారని భావించారు. అందుకనే బహుశా వారికి విడిగా కఠినమైన నిబంధనలేవీ ప్రత్యేకంగా చెప్పలేదు! కానీ, ఆ కుర్చీలలో కూర్చున్న సదరు నాయకులు మాత్రం అత్యంత చిన్న మనస్తత్వంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవర్తిస్తూ, తమ అసలు నైజాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఫలితంగా ఈ కమిటీలలో కూర్చున్న సభ్యుల తీరు “కత్తులు ఇచ్చారు కానీ, వాటిని ఎలా తిప్పాలో తెలియని” చందంగా తయారైంది. తిప్పడం రాని వారి చేతికి లీగల్ అస్త్రాలు దొరకడంతో.. వారు ఇష్టమొచ్చినట్లు అర్హులైన సామాన్య జర్నలిస్టులపై ఆ కత్తులను ఝలిపిస్తూ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు.
ఇక్కడ ఒక చేదు నిజాన్ని స్పష్టం చేయాలి. ఈ అరాచక తంతు కేవలం రాష్ట్ర రాజధానిలోని స్టేట్ మీడియా అక్రిడిటేషన్ కమిటీలకే పరిమితం కాలేదు. ఇదే తరహా మాఫియా దందా, ఇదే రకమైన గుత్తాధిపత్య కుట్రలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల (District Level) అక్రిడిటేషన్ కమిటీలలోనూ బేషరతుగా సాగుతున్నాయి. జిల్లాల్లో రాత్రి పగలు కష్టపడే జెన్యూన్ రిపోర్టర్లను సంఘాల పేరుతో, వ్యక్తిగత కక్షలతో తొక్కిపెడుతూ.. దళారీలు, అనర్హులకు మాత్రం దొడ్డిదారిన కార్డులు పంచుతున్నారు. మీడియా అక్రిడిటేషన్ నిబంధనలను నిర్దేశించే ప్రభుత్వ జీవోల (G.O.) ప్రకారం ఈ స్క్రీనింగ్ కమిటీలకు ఉన్నది కేవలం ‘రైట్ ఆఫ్ రికమండేషన్’ (సిఫార్సు చేసే అధికారం) మాత్రమే. అంతిమంగా కార్డు మంజూరు చేసే లేదా తిరస్కరించే సర్వాధికారాలు కేవలం ప్రభుత్వానికి, సమాచార శాఖ కమిషనర్‌కు మాత్రమే ఉంటాయి. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కమిటీలలో కూర్చున్న కొందరు ముఠా నాయకులు తామే సర్వాధికారులమని భ్రమిస్తూ అధికారులను సైతం డిక్టేట్ చేస్తూ ప్రభుత్వాన్ని సైతం ఇరకాటంలోకి నెడుతున్నారు.
📌 ఫ్రీలాన్స్ కార్డుల ‘మాయాజాలం’.. తేలని అంకగణితం!
ఈ కమిటీల దొంగ దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం కావడానికి కేవలం ఒక ఉదాహరణ చూస్తే మెదడు మొద్దుబారడం ఖాయం. అనధికార సమాచారం ప్రకారం.. ఈ రోజు మార్కెట్లో ఏకంగా 770 ఫ్రీలాన్స్ లేదా ఇండిపెండెంట్ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశారు. అసలు ఐ&పీఆర్ జీవో నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఒక ఫ్రీలాన్స్ కార్డు దక్కాలంటే సదరు జర్నలిస్టుకు కనీసం 5 ఏళ్ల పాటు అక్రిడిటెడ్ కరస్పాండెంట్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. దాంతో పాటు ప్రధాన పత్రికలలో లేదా ‘ఎ & బి’ గ్రూపులో ఉన్న చిన్న పత్రికలలో కనీసం 15 నుండి 20 బైలైన్ ప్రత్యేక వ్యాసాలు రాసి ఉండాలి.
ఇప్పుడు ఒక చిన్న లెక్క వేద్దాం. 770 కార్డులకు, కార్డుకు 15 చొప్పున లెక్కేసినా కనీసం 11,550 బైలైన్ ఆర్టికల్స్ మార్కెట్లో ఉన్న పత్రికలలో ముద్రితం కావాలి. నేడు మార్కెట్లో అర్హత ఉన్న ప్రధాన పత్రికలు వేళ్లమీద లెక్కించదగ్గవి 5 లేదా 10 మాత్రమే ఉన్నాయి. ఒకవేళ చిన్న పత్రికలన్నింటినీ కలిపి 50 అనుకున్నా.. ఈ 11,550 బైలైన్ కథనాలు ఆయా పత్రికలలో ఎక్కడ అచ్చయ్యాయో ఆ దేవుడికే తెలియాలి! క్షేత్రస్థాయిలో వార్త ముఖం చూడనోళ్లకు, కనీసం ఒక్క లైన్ సొంతంగా రాయనోళ్లకు ఇన్ని వందల కార్డులు ఎలా వచ్చాయి? ఈ లెక్కను బట్టే అర్థం కావడం లేదా.. ఇదంతా కోట్ల రూపాయలు చేతులు మారిన ఒక పెద్ద “నోట్ల దందా” అని? ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ ముఠా ఇలాగే చెలరేగి పోతున్నది .
ఖబర్దార్ యూనియన్.. బహుపరాక్!
నాలుగు గోడల మధ్య కూర్చుని నచ్చిన వారికి కార్డులు పంచి, జెన్యూన్ పాత్రికేయులపై కత్తులు నూరుతున్న ఈ దొంగల భాగోతంపై యావత్ జర్నలిస్ట్ లోకం నిఘా పెట్టింది. సమాచార శాఖలో పారదర్శకత రావాలంటే ఈ కమిటీ సమావేశాలన్నింటినీ పూర్తిస్థాయిలో రికార్డు చేయాల్సిందే, రేపు న్యాయస్థానాల ముందు ప్రతి ఒక్కరూ జవాబు చెప్పుకోవాల్సిందే.
గుత్తాధిపత్య ముఠా నాయకులు ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి.. ప్రభుత్వ పెద్దలు తెలియనంత వరకో లేక మోహమాటపడుతున్నంత వరకే మీ ఆటలు సాగుతాయి. ఏ రోజు అయితే ప్రభుత్వ పెద్దలు ఈ దళారీ ముఠా కుట్రలను, దందాలను సంపూర్ణంగా తెలుసుకుంటారో.. ఆ మరుసటి తెల్లవారే మీ దొంగ బ్రతుకులు నిలువునా తెల్లారడం ఖాయం! ఖబర్దార్ . బహుపరాక్!
– పురుషోత్తం నారగౌని
సీనియర్ జర్నలిస్ట్ & రాష్ట్ర అధ్యక్షుడు, TSJU
