కలం యోధులపై కత్తుల వేటు! – 3
ఎవరెవరికి సద్ది కట్టారో బయటపడుతుందనే భయంతోనే దాస్తున్నరు
జీవోల దాగుడుమూతలు: 252 జీవో తర్వాత అక్రిడిటేషన్ కమిటీలను ఎలా వేశారు? సభ్యులుగా ఎవరిని నియమించారు? దానికి సంబంధించిన ఏ ఒక్క జీవో కూడా వెబ్సైట్లో పెట్టకుండా అంతా రహస్యమే!
పాత జీవోల మాయాజాలం: ఈ ప్రక్రియకు మూలాలైన గతంలోని 239 జీవో, 1395 జీవో లాంటి ఎన్నో కీలకమైన చారిత్రక ఉత్తర్వులను వెబ్సైట్ నుండి పూర్తిగా మాయం చేశారు.
అన్ని విభాగాల్లోనూ ప్రమాదం: నిన్న మనం చెప్పుకున్న 770 ఫ్రీలాన్స్ కార్డుల దొంగ లెక్కల ప్రమాదం ఒక్క అక్రిడిటేషన్లకే కాదు.. సమాచార శాఖలోని ప్రతి విభాగంలోనూ పొంచి ఉంది!
నవీన్ మిట్టల్ నాటి నగ్నసత్యాలు: గతంలో సమాచార కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రత్యక్ష తనిఖీలు చేసినప్పుడు కూరగాయలు అమ్మేవాళ్లకు, ప్రెస్ క్లబ్లో టేబుళ్లు తుడిచేవాళ్లకు కార్డులిచ్చిన ముఠా ఘనత బయటపడింది!
ఉండాల్సిన సమాచారం ఏది? దాస్తున్న రహస్యాలు ఎవరి కోసం?
సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) వెబ్సైట్ నిజానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్క జర్నలిస్టుకూ, సామాన్య పౌరుడికీ ఒక పారదర్శక సమాచార వేదికగా ఉండాలి. కానీ, సమైక్య రాష్ట్రం నాటి నుండి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ వెబ్సైట్లో జర్నలిస్టులకు ఉపయోగపడే కీలక సమాచారం, జీవోలు ఎప్పుడూ ఉండవు!
దేశంలోని ఎన్నో చిన్న రాష్ట్రాలను గమనిస్తే.. అక్కడ ఇలాంటి సమాచారం అంతా అత్యంత బహిరంగంగా, పారదర్శకంగా వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. ఏ జర్నలిస్టుకు కార్డు ఉందో, ఏ పత్రికకు ఎలాంటి గుర్తింపు ఉందో ఎవరైనా ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు. కానీ, ఐటీ హబ్‌గా చెప్పుకునే మన దగ్గర మాత్రం ప్రతి అడుగులోనూ దొంగాటలు, దొంగ దందాలు సాగుతున్నాయి.
రాష్ట్రంలో అసలు ఎంతమందికి అక్రిడిటేషన్ కార్డులు ఉన్నాయి? వారి పూర్తి జాబితా ఏంటి? ఐ&పీఆర్ ద్వారా ఎంపానెల్మెంట్ పొందిన పత్రికల లిస్ట్ ఏంటి? ఇలాంటి అత్యంత కీలకమైన ఏ ఒక్క రికార్డూ ఈ వెబ్సైట్లో దొరకదు. అంతా రహస్యమే!
దాస్తున్న ‘జీవోల’ వెనుక దాగున్న అసలు కుట్ర!
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఎంతో ఉదారతతో ఉంది. నిబంధనలు సడలించి అయినా కార్డులు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి, మంత్రి గారి ఆశయాలను వెబ్సైట్ వెనుక దాస్తూ ఈ గుంతనక్కలు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. అధికారులు కొత్తగా 252 జీవోను పెట్టి చేతులు దులుపుకున్నారు కానీ.. దానికి మూలాలైన గతంలోని 239 జీవో, 1395 జీవో లాంటి ఎన్నో కీలకమైన చారిత్రక ఉత్తర్వులను (G.O.s) వెబ్సైట్ నుండి పూర్తిగా మాయం చేశారు. పాత నిబంధనలు జర్నలిస్టులకు తెలియకుండా ఉంటేనే తాము అనుకున్నట్లు చక్రం తిప్పవచ్చని ఈ ముఠా ప్లాన్!
అంతెందుకు.. ఈ 252 జీవో ఇచ్చిన తర్వాత రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలను ఎలా ఏర్పాటు చేశారు? ఆ కమిటీల్లో సభ్యులుగా ఎవరెవరిని నియమించారు? అనే దానికి సంబంధించిన కనీస ఉత్తర్వులు (జీవోలు) కూడా వెబ్సైట్లో వెతకబోయినా దొరకవు! ఏ సంఘం నుండి ఎవరిని కమిటీల్లోకి దూర్చారో బయటకు తెలిస్తే, వారి అర్హతలు బట్టబయలవుతాయని ఆ గుంతనక్కల ముఠా ఆడుతున్న దాగుడుమూతల నాటకంలో భాగమే ఈ గోప్యత!
ఒకవేళ ఈ జీవోలు, లిస్టులు గనుక బయటపెడితే.. ఈ నాయకులు లోపల కూర్చుని ఎంతమంది అనర్హులకు, దొంగలకు దొడ్డిదారిన “సద్ది కట్టారో” ఆ దొంగ లెక్కలన్నీ సంపూర్ణంగా బయటపడతాయని వీరు వణికిపోతున్నారు. నిన్న మనం లెక్కలతో సహా బట్టబయలు చేసిన 770 ఫ్రీలాన్స్ కార్డుల మాయాజాలం కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే! అసలు ప్రమాదం ఏంటంటే.. కేవలం అక్రిడిటేషన్లలోనే కాదు, సమాచార శాఖలోని అన్ని విభాగాల్లోనూ, బడ్జెట్ కేటాయింపుల్లోనూ, ప్రకటనల జారీలోనూ ఇలాంటి దొంగ లెక్కలే రాజ్యమేలుతున్నాయి.
చిన్న పత్రికల గొంతు కోస్తున్న ‘ఎంపానెల్మెంట్’ కుట్ర!
ఈ వెబ్సైట్ చీకటి కేవలం అక్రిడిటేషన్లకే పరిమితం కాలేదు.. ఎన్నో సంవత్సరాలుగా చిన్న పత్రికలకు సంబంధించిన ‘ఎంపానెల్మెంట్’ (ప్రభుత్వ ప్రకటనల గుర్తింపు) జాబితా కూడా కనీసం ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం లేదు. అసలు ఏ పత్రిక ఏ గ్రూపులో ఉందో, ఏ చిన్న పత్రికకు ప్రభుత్వ గుర్తింపు ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి సృష్టించారు.
గతంలో సమాచార శాఖ కమిషనర్‌గా నవీన్ మిట్టల్ ఉన్నప్పుడు ఆయన స్వయంగా రంగంలోకి దిగి చేసిన ‘ఫిజికల్ ఎంక్వైరీ’ లో ఇలాంటి నగ్నసత్యాలే బయటపడ్డాయి. ఆ రోజుల్లో నిఖార్సయిన జర్నలిస్టులను పక్కనబెట్టి.. కూరగాయలు అమ్మేవాళ్లకు, ప్రెస్ క్లబ్‌లలో టేబుళ్లు తుడిచే క్లీనర్లకు, గ్రామాల సర్పంచ్‌లకు కూడా అడ్డగోలుగా కార్డులు ఇప్పించిన ‘మహా ఘనత’ ఈ గుత్తాధిపత్య సంఘాల ముఠాకే దక్కింది! ఇప్పుడు కూడా తమ సొంత తాబేదార్లను కమిటీలలో కుదుర్చుకుని ఎన్నెన్ని దొంగ లీలలు నడిపిస్తున్నారో తెలిసిపోతుందనే భయంతోనే ఈ గుంతనక్కలు సమాచారాన్ని దాచేస్తున్నారు.
: ఇప్పుడైనా పారదర్శకత రాకపోతే ప్రమాదమే!
ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, సమాచార శాఖ మంత్రి గారు యావత్ జర్నలిస్ట్ లోకానికి మేలు చేయాలనే సదుద్దేశంతో అడుగులు వేస్తున్నారు. కానీ, పాలకుల ఈ మంచి తనాన్ని ఆసరాగా చేసుకుని, తెరవెనుక దందాలు నడిపే ఈ పెద్ద మనుషుల సంఘం… ప్రభుత్వ ఆశయాలకు గొడ్డలిపెట్టుగా మారింది.
ఐ&పీఆర్ వెబ్‌సైట్‌ను తక్షణమే డిజిటలైజ్ చేసి, మాయం చేసిన పాత జీవోలతో పాటు కమిటీల ఏర్పాటు జీవోలను, ప్రతి జిల్లా అక్రిడిటేషన్ జాబితాను, చిన్న పత్రికల ఎంపానెల్మెంట్ గ్రూపుల వివరాలను ఆన్లైన్లో బహిరంగపరచాలి. ఈ ముఠా చేసే మోహమాటాలకు లొంగకుండా వెబ్‌సైట్‌ను పారదర్శకంగా మార్చకపోతే.. సమాచార శాఖే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.
- పురుషోత్తం నారగౌని
సీనియర్ జర్నలిస్ట్ & రాష్ట్ర అధ్యక్షుడు, TSJU
