సమాచార శాఖలో ‘ధృతరాష్ట్ర కౌగిలి’ ఎవరి కోసం?
అర్థం లేని నిబంధనలతో ఆగమైన అక్రిడిటేషన్లు: గుత్తాధిపత్య ముఠా కుట్రలపై ప్రత్యేక విశ్లేషణ!
అసలు ఏమిటీ అక్రిడిటేషన్? జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియ ఎందుకు కోర్టుల పాలైంది?
సామాన్య జర్నలిస్టుల పాలిట ‘యముడిలా’ మారిన పాత్రికేయ సంఘాలు.. ఉనికి లేని యూనియన్లకూ కమిటీల్లో చోటా?
కమిటీల సభ్యత్వం కోసం, అక్రిడిటేషన్ల కోసం ‘నోట్ల దందా’.. నిజనిర్ధారణ కమిటీ వేస్తే తేలే అక్రమాలు!
మంత్రి గారికి ఇతర శాఖల బిజీ.. సమాచార శాఖను నిర్లక్ష్యం చేస్తే నిలువునా ముంచేయడం ఖాయం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిఖార్సయిన పొలిటికల్ అలర్ట్!
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిజం రంగంలో నిరంతరం శ్రమించే వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అధికారిక గుర్తింపునే ‘అక్రిడిటేషన్’ అంటారు. సమాచార సేకరణలో, ప్రభుత్వ ప్రెస్మీట్లకు వెళ్లినప్పుడు, విధి నిర్వహణలో ప్రయాణాలు చేసినప్పుడు జర్నలిస్టులకు ఇదొక రక్షణ కవచం లాంటిది. అయితే, గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అక్రిడిటేషన్ల కేటాయింపు ప్రక్రియ తీవ్రమైన గందరగోళంలో పడిపోయింది. జీవోల పైన, కమిటీలలో భాగస్వామ్యాల పైన న్యాయస్థానాలలో కేసులు నడుస్తుండటంతో.. గత ఆరు నెలలుగా కార్డుల కాలపరిమితిని కేవలం 15 రోజులు, నెల రోజులు చొప్పున తాత్కాలికంగా పొడిగించుకుంటూ రావాల్సి వస్తోంది.
ఒక పాత్రికేయుడికి ఇచ్చే గుర్తింపు కార్డును ఇలా అరకొర రోజులకు పొడిగించాల్సి రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? దశాబ్దాలుగా జర్నలిస్టుల సమస్యలు ఎందుకు తీరడం లేదు? అని లోతుగా విశ్లేషిస్తే, ప్రభుత్వాల కంటే ఈ రంగంలో తిష్టవేసిన కొన్ని ‘సోయి లేని’ శక్తులే ప్రధాన కారణమనే చేదు నిజం స్పష్టమవుతోంది. అక్రిడిటేషన్ కమిటీలు జర్నలిస్టులకు లాభం చేయడానికి ఉండాలి గానీ, వారిని భయపెట్టడానికి, నియంత్రించడానికి కాదు. కానీ నేడు కొందరు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, ఇతర యూనియన్ల వారిని బెదిరించడానికి ఈ కమిటీలను ఒక ఆయుధంగా వాడుకుంటూ యావత్ జర్నలిస్ట్ లోకాన్ని ధృతరాష్ట్ర కౌగిలిలో నలిపేస్తున్నారు.
⚖️ సామాన్య జర్నలిస్టుల పాలిట ‘యముడు’గా మారిన సంఘాలు!
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడున్న కొన్ని పాత్రికేయ సంఘాలు సామాన్య వర్కింగ్ జర్నలిస్టుల పాలిట ఒక “యముడిలా” తయారయ్యాయి. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ సంఘాల వల్ల క్షేత్రస్థాయి పాత్రికేయుల సమస్యలు తీరడం లేదు సరిగదా, వారి పేరిట తమ సొంత అవసరాలను తీర్చుకుంటూ కొందరు పదవులను, అధికారాన్ని అనుభవిస్తున్నారు. పైగా ప్రెస్ క్లబ్‌ల పేరిట కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా అనుభవిస్తూ.. సామాన్య జర్నలిస్టుల బ్రతుకులను మాత్రం అక్రిడిటేషన్ కార్డుల చుట్టూ తిప్పుతున్నారు. గత ప్రభుత్వంలో ఒక సంఘం ఇష్టారాజ్యంగా అధికారం చెలాయిస్తే.. ఈ కొత్త ప్రభుత్వంలో రాజకీయ లెక్కలతో చైర్మన్ పీఠంపై కూర్చున్న నేత, తమ సొంత సంఘానికి అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ, సామాన్య జర్నలిస్టులను అలాగే వాళ్ళ మాట వినని ఇతర సంఘాలను అణచివేయడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతున్నారు.
దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన ఈ సంఘం, ఇతర రిజిస్టర్డ్ యూనియన్లను వీలైనంత వరకు కమిటీలలోకి రానీయకుండా అడ్డుకుంటోంది. అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నామన్న ముసుగు వేసి.. తెరవెనుక అంతా తమ సొంత అనుబంధ సంఘాల వారిని, ఏమాత్రం అర్హత లేని వారిని నింపుకుని ఒక పెద్ద తోలుబొమ్మలాట ఆడుతున్నారు. ఒకవేళ కమిటీలో ఎవరైనా జర్నలిస్టుల సమస్యల కోసం నిజాయితీగా గొంతు విప్పితే, తమకు ఉన్న అడ్డగోలు మెజారిటీ బలంతో ఆ నోళ్లను దారుణంగా నొక్కేస్తున్నారు. ఈ వరుసలో చేరిన ఎన్నో సంఘాలు కనీసం ఒక్కసారి అయినా జర్నలిస్టుల హక్కుల కోసం మాట్లాడింది లేదు, కొట్లాడింది లేదు. అలాంటి డమ్మీ సంఘాలను కూడా అక్రిడిటేషన్ కమిటీల్లో చేర్పించి.. తమ మాట వినని జర్నలిస్టుల కార్డులను కావాలనే ‘రిజెక్షన్’ పేరిట వింత నాటకానికి తెరతీశారు.
వాస్తవానికి వీరు అక్రిడిటేషన్ కమిటీలలో ఈ స్థాయిలో దందాగిరి చేయడానికి ప్రధాన కారణం.. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి సొంత జిల్లా అయిన ఖమ్మంలో ఉన్న రాజకీయ అవసరాలేనని జర్నలిస్టు లోకం కోడై కూస్తోంది. అక్కడ తమ రాజకీయ ప్రాబల్యం కోసం అక్కడ బలంగా ఉన్న ఒక రాజకీయ పార్టీ అండ అవసరం కావడం, ఆ పార్టీ కోటాలోనే ఈ నేతకు చైర్మన్ పదవి దక్కడంతో.. సదరు సంఘం నాయకులు ఇక్కడ అడ్డగోలుగా రెచ్చిపోతున్నారనే చర్చ నడుస్తోంది.
🛑 7 ఏళ్ల నిబంధన: ఒక పెద్ద లీగల్ బూటకం!
ప్రస్తుతం ఈ అక్రిడిటేషన్ నిబంధనలపై కోర్టులలో నడుస్తున్న కేసుల వెనుక ఉన్న అసలు లీగల్ లూప్‌హోల్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. చట్టబద్ధంగా రిజిస్టర్ అయి, అన్ని అర్హతలు ఉన్న యూనియన్ల పేర్లను జీవోలలో కావాలనే చేర్చకుండా కుట్రపూరితంగా పక్కనబెట్టడం ఒక ఎత్తయితే.. అసలు ఈ అక్రిడిటేషన్ కమిటీలలో ఉండటానికి కనీస అర్హతగా ‘7 ఏళ్ల సీనియారిటీ’ నిబంధనను నిర్ణయించడమే చట్టప్రకారం ఒక పెద్ద ఉల్లంఘన ! రాజ్యాంగ విరుద్ధమైన ఈ అడ్డగోలు నిబంధన వల్ల చాలా సంఘాలు ఈ కమిటీలలో భాగం కాలేకపోయాయి. అసలు ఈ నిబంధన పెడితే చట్ట ప్రకారం నిలబడదని తెలిసినప్పటికీ, సదరు సంఘం పెద్దలు మంత్రి గారికి మాయ మాటలు చెప్పి తమ పని కానిచ్చేశారు. ఫలితంగా ఇప్పుడు కోర్టుల్లో ప్రభుత్వం పరువు పోగొట్టుకోవాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం కోర్టుల్లో ఉన్నవి చాలా చిన్న కేసులే. దీని అసలు సిసలైన లీగల్ లోపాలపై ఇప్పటి వరకు ఎవరూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించలేదు. ఒకవేళ గనుక దీనిపై పక్కా లీగల్ గ్రౌండ్స్‌తో కోర్టుకు వెళితే.. ఈ అక్రమ కమిటీల మనుగడకు ఫుల్ స్టాప్ పడ్డట్టే!
ఇక అక్రిడిటేషన్ కమిటీల ప్రహసనం ఎలా ఉందంటే.. రాజకీయ నాయకులు పదవుల కోసం రాత్రికి రాత్రే పార్టీలు మార్చినట్లుగా, కేవలం అక్రిడిటేషన్ కమిటీలో సభ్యుడిగా కూర్చోవడం కోసం తమ పాత యూనియన్లను వీడి, రాత్రికి రాత్రే కొత్త యూనియన్ల ముసుగు తొడిగిన ఘనులు ఈ కమిటీలలో తిష్టవేశారు. ఈ సభ్యత్వాల కేటాయింపు వెనుక లక్షల రూపాయల డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక “అధికారం మాదే” అని చెప్పుకుంటున్న సదరు యూనియన్ పెద్దలు.. దొడ్డిదారిన ఎంతో మందికి అక్రిడిటేషన్లు దారాదత్తం చేస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారనే నగ్న సత్యం జర్నలిస్టులందరికీ తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి ‘నిజనిర్ధారణ కమిటీ’ వేస్తే.. ఎవరెవరి ద్వారా ఎంతెంత డబ్బులు చేతులు మారాయో, ఏయే అక్రమాలు జరిగాయో అన్నీ బట్టబయలవుతాయి. గత దశాబ్ద కాలంగా జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నా ఒక్క పోరాటం కూడా చేయని శక్తులు.. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో హఠాత్తుగా జర్నలిస్టుల రక్షకుల్లా ముసుగులు వేసుకుని అధికారులను ను సైతం మాయచేస్తున్నారు.
📉 చిన్న పత్రికల నిర్లక్ష్యం — కార్డుల బ్లాక్ మార్కెట్ దందా!
మరోవైపు, రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పెన్షన్ సమస్యలు inko వైపు చిన్న మరియు మీడియం పత్రికలు ఎంపానెల్మెంట్ లేక ఎన్నో సంవత్సరాలుగా కునారిల్లుతుంటే, వాటి గురించి మాట్లాడే నాథుడే లేడు. కానీ కార్డుల చుట్టూ అనవసరమైన హైప్ పెంచి, ఒక పెద్ద ‘అమ్మకాల దందా’ సాగిస్తూ నాటకాలు ఆడుతున్నారు. యాజమాన్యాలు జర్నలిస్టులకు జీతాలు ఇవ్వకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఈ అక్రిడిటేషన్ ను ఒక అధికారిక ‘లైసెన్స్’ లాగా మార్చేసి, అర్హత లేని వ్యాపారులకు, బ్రోకర్లకు కార్డులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆఖరికి మన జర్నలిస్టుల బ్రతుకులను కేవలం అక్రిడిటేషన్ల చుట్టూ తిప్పేసి ఒక వ్యవస్థీకృత అరాచకాన్ని సృష్టించారు.
ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం సమాచార శాఖ లోపల ఒక అగ్నిపర్వతంలా రగులుతోంది.. ఇది ఏ క్షణమైనా బద్దలు కావచ్చు! పాపం, గౌరవనీయ సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి అటు ఇందిరమ్మ ఇళ్లు, ఇటు రెవెన్యూ శాఖ లాంటి అత్యంత భారీ, ప్రధానమైన పరిపాలనా పనులు ఉండటం వల్ల.. ఆయనకు ఈ ఐ&పీఆర్ శాఖ అంత ప్రాధాన్యత లేని చిన్న శాఖగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ, రాజకీయంలో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న లోపాలే పెద్ద ముప్పుగా మారుతుంటాయి! ఈ శాఖను గనుక మంత్రి గారు తక్షణమే ప్రక్షాళన చేసి సమస్యను పరిష్కరించకపోతే.. కమిటీల్లో తిష్టవేసిన ఆ ఒక్క గుత్తాధిపత్య సంఘం మొత్తం వ్యవస్థను నిలువునా ముంచేయడం ఖాయం.
ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఒక నిజాన్ని గ్రహించాలి.. మీరు “మనవాడు” అనుకుంటూ నెత్తిన పెట్టుకుంటున్న ఆ నాయకుడు, తెరవెనుక ప్రతిపక్ష అగ్రనేతలకు అత్యంత ఆప్తుడు, వారి వ్యాపార భాగస్వామి అని కూడా ఇండస్ట్రీలో గట్టిగా అనుకుంటున్నారు. “మీ వాళ్లు కాని వారిని మీరు నెత్తిన పెట్టుకుంటే.. మీరు అగమైపోవడం ఖాయం” అనే ఈ నిఖార్సయిన హెచ్చరికను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి అలర్ట్ అవ్వాలి.
సమాచార శాఖలో జరుగుతున్న లీగల్ బూటకాలు ఏమిటి? అన్ని రిజిస్టర్డ్ యూనియన్లకూ అవకాశం ఇవ్వాలన్న సదుద్దేశ ఆలోచనలకు స్వస్తి పలికింది ఎవరు? కమిటీలలో తిష్టవేసిన నాయకుల అసలు అర్హతలు ఏమిటి? వారు ఎవరి ఫైళ్లను కావాలని తొక్కుతున్నారు? ఈ దళారీ ముఠా వెనుక ఉన్న అసలు పొలిటికల్ లింకులు ఏమిటి? అనే సంచలనాత్మక నిజాలను ఎండగడుతూ సాగే ప్రత్యేక విశ్లేషణాత్మక వ్యాసాల సిరీస్ రేపటి నుండి ప్రారంభం కానుంది…
(మరుసటి భాగంలో: అక్రిడిటేషన్ స్క్రీనింగ్ కమిటీ మీటింగులను ‘లైవ్ స్ట్రీమింగ్’ చేయాలి. నాలుగు గోడల మధ్య సాగుతున్న దొంగ దందాల గుట్టు రట్టు చేయాలి )
— పురుషోత్తం నారగౌని
సీనియర్ జర్నలిస్ట్ & రాష్ట్ర అధ్యక్షుడు, TSJU
